మహారాష్ట్రలో స్కూల్స్ ప్రారంభం

ఓ వైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ ... ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా పిల్లల చదువులు మాత్రం ముందుకు సాగడం లేదు. స్కూల్స్ ఇలా తెరవడం అలా మూసేయడం జరుగుతూ వస్తోంది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా మరోసారి పలు రాష్ట్రాల్లో విద్యాలయాలకు తాళాలు పడ్డాయి. అయితే ఈ పరిస్థితుల్లో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ ను తెరిచేందుకు సిద్ధమైంది. జనవరి 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. 

దీంతో ఇవాళ పలు స్కూల్స్ తెరుచకున్నాయి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు ప్రారంభమయ్యాయి.  ముంబైలో ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) తరగతులకు పాఠశాలలు తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్కూల్స్ శానిటైజ్ చేశామని చెబుతున్నారు. తల్లిదండ్రులు రాతపూర్వకంగా అంగీకారం తెలుపుతూ క్లాసులకు పంపిన విద్యార్థులకు మాత్రమే తరగతి గదిలోకి అనుమతి ఇస్తున్నామని తెలిపారు.  కోవిడ్ నిబంధనలను అనుసరించి పాఠశాలల్లో చదువులు సాగనున్నాయని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

విద్యార్థులు  కరోనా రూల్స్ పాటించాలని మంత్రి ఆదిత్యఠాక్రే సూచించారు. అయితే కోవిడ్ కేసులు  ఎక్కువగా నమోదవుతున్న పుణె, ఔరంగాబాద్ లలో పాఠశాలలు ప్రారంభం కాలేదని విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలు పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పాఠశాలల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని..విద్యార్థుల భద్రత, ఆరోగ్యమే తమకు ముఖ్యమన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పాఠశాలలో కోవిడ్ వ్యాప్తి జరగకుండా ఒక్క బెంజ్ కు ఒక్క విద్యార్థి మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు. అయితే మెజార్టీ తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు ఇష్టపడటం లేదు. వైరస్ వ్యాప్తి తగ్గితే పాఠశాలలకు పంపిస్తామని చెబుతున్నారు.