గంగాధర/రామడుగు, వెలుగు : స్కూళ్లను బాగు చేసే పెద్ద బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులకు అప్పగించిందని, దగ్గరుండి పనులు పూర్తి చేయించాలని కమిటీ సభ్యులకు కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గంగాధర మండలం రంగారావుపల్లి, ఆచంపల్లి గ్రామాల్లోని ప్రైమరీ, యూపీఎస్ స్కూళ్లలో కమిటీల ద్వారా చేపడుతున్న పనులను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తాగునీరు, కరెంట్ సప్లై, టాయిలెట్స్, ఇతర రిపేర్ పనులన్నింటినీ జూన్ 12లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రంగారావుపల్లిలో స్కూల్ యూనిఫామ్స్ కుట్టే మహిళాశక్తి కుట్టు కేంద్రాన్ని సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో కస్తూర్బా, మోడల్ స్కూల్స్, అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 30,810 మందికి యూనిఫామ్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం గంగాధర, లక్ష్మీదేవిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీఆర్డీవో సునీత, డీఎల్పీవో రాంబాబు, డీపీఎం ప్రవీణ్, తహశీల్దార్ వినయ్‌కుమార్, ఎంపీడీవో రాము, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రామడుగు మండలం చిప్పకుర్తి స్కూల్లో జరుగుతున్న అభివృద్ది పనులను అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్పరిశీలించారు.