సైంటిఫిక్ రీసెర్చ్ ప్రూవ్..గంజాయిలో ఓ మంచి ఔషధం

సైంటిఫిక్ రీసెర్చ్ ప్రూవ్..గంజాయిలో ఓ మంచి ఔషధం
  • గంజాయితో నిద్రలేమికి ట్రీట్మెంట్!
  • నిద్రను ఇది మెరుగుపరుస్తుందని రీసెర్చ్​లో వెల్లడి 
  • గాంజాలోని కన్నాబినాల్​ను మెడిసిన్​గా వాడేందుకు చాన్స్ 

సిడ్నీ: గంజాయి కేవలం మత్తు పదార్థంగానే కాకుండా వైద్యపరంగా అనేక అనారోగ్యాలను పారదోలే మంచి ఔషధంగా కూడా పని చేస్తుందని భావిస్తుంటారు. అయితే, గంజాయిలోని కన్నాబినాల్ అనే పదార్థం నిద్రలేమి (ఇన్ సోమ్నియా) సమస్యకు చెక్ పెడుతుందని తాజాగా ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ సైంటిస్టులు కనుగొన్నారు. గంజాయితో మనుషుల్లో నిద్ర మెరుగు పడుతుందని ఇదివరకే గుర్తించినా.. అది ఎలా పని చేస్తుందని చెప్పేందుకు  కచ్చితమైన ఆధారాలు దొరకలేదని సైంటిస్టులు తెలిపారు. 

గాంజా లోని కన్నాబినాల్(సీబీఎన్) అనే పదార్థమే నిద్రను మెరుగుపరుస్తోందని తొలిసారిగా తమ పరిశోధనలో తేలిందన్నారు. ఎలుకలకు కన్నాబినాల్ ఇచ్చి, జరిపిన ప్రయోగాల్లో వాటి నిద్ర బాగా మెరుగుపడిందన్నారు. తర్వాత కొందరు ఇన్​సోమ్నియా పేషెంట్లకూ కన్నాబినాల్ ఇవ్వగా.. వారిలోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ప్రస్తుతం మనుషుల్లో దీనితో ప్రయోగాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

 ‘‘మనుషులు నిద్రపోయినప్పుడు రెండు కండ్లూ వేగంగా కదులుతుండటం (ర్యాపిడ్ ఐ మూమెంట్–ఆర్ఈఎం) లేదా వేగంగా కదలకుండా ఉండటం (నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్–ఎన్ఆర్ఈఎం) అనే దశలు ఉంటాయి. ఎన్ఆర్ఈఎం డీప్ స్లీప్ వల్ల శరీరంలో ఫిజికల్ రికవరీ, మెమరీలు బలోపేతం అవుతుంటాయి. ఆర్ఈఎం స్లీప్ వల్ల కలలు రావడంతోపాటు, ఎమోషన్లు ప్రాసెసింగ్ అవుతుంటాయి. 

అయితే, ఇన్ సోమ్నియా పేషెంట్లకు నిద్ర పట్టక అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది” అని సైంటిస్టులు పేర్కొన్నారు. నిద్రలేమికి ఇప్పటికే మందులు ఉన్నా, పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, అందుకే కన్నాబినాల్​తో ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. అమెరికా, తదితర దేశాల్లో వైద్యపరంగా గంజాయిని వాడేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. సైంటిఫిక్​గా బలమైన ఆధారాలు లేకపోయినా.. నిద్రలేమికి గంజాయి ఉత్పత్తులను వాడుతున్నారు.