
చంఢీఘర్: బైక్ పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ ఓ యువ సైంటిస్ట్ ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జార్ఖండ్ ధన్ బాద్‌కు చెందిన డాక్టర్ అభిషేక్ సర్ణకార్(39) అనే యువ సైంటిస్ట్ పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. మొహాలీలోని సెక్టార్ 67లో ఫ్యామిలీతో కలసి అభిషేక్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం (మార్చి 11) రాత్రి బండి పార్కింగ్ విషయంలో అభిషేక్‌కు, పొరుగింట్లో ఉండే మాంటీ అనే వ్యక్తికి మధ్య గొడవ జరిగింది.
ఈ వివాదం మరింత ముదిరి ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మాంటీ ఒక్కసారిగా అభిషేక్‌పై దాడి చేశాడు. పిడి గుద్దులు కురిపిస్తూ విచక్షణ రహితంగా దాడి చేశాడు. మాంటీ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అభిషేక్ నేలకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అభిషేక్‌ను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించే లోపే అభిషేక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సైంటిస్ట్ అభిషేక్‌కు ఇటీవలే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఇంకా పూర్తిగా కోలుకోకముందే మాంటీ విచక్షణరహితంగా దాడి చేయడంతో అభిషేక్ మరణించాడు.
ALSO READ | సైబర్ క్రైమ్ : వాట్సాప్ లో ఈ సెట్టింగ్ లేకపొతే మీ ఫోన్ హ్యాక్ చేయడం ఈజీ
ఈ మేరకు అభిషేక్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మాంటీపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిషేక్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సైంటిస్ట్ అభిషేక్ పై మాంటీ దాడి చేసిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చిన్న విషయానికి యువ సైంటిస్ట్ ప్రాణాలు తీసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.