- అమెరికా సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
- మైక్రోప్లాస్టిక్స్ వల్ల మగవారిలో ఇన్ ఫర్టిలిటీ ముప్పు
డ్యూక్ సిటీ(యూఎస్ఏ): ప్రపంచాన్ని చెత్తకుప్పలా మార్చేస్తున్న ప్లాస్టిక్ భూతం ఇప్పుడు తాగే నీళ్లలో, తినే తిండిలో కూడా కలిసిపోతోంది. ప్లాస్టిక్ కలిసిన నీళ్లు, తిండి కారణంగా ప్లాస్టిక్ కణాలు మన శరీరాల్లోకి చేరి వివిధ అవయవాల్లోకి సైతం చొచ్చుకెళ్తున్నాయి. మనుషుల రక్తం, గుండె.. చివరకు గర్భిణుల మావిలోకి కూడా మైక్రోప్లాస్టిక్స్ చేరుతున్నాయని ఇదివరకే పలు పరిశోధనల్లో తేలగా.. తాజాగా మగవారి వృషణాల్లో సైతం ఇవి తిష్ట వేస్తున్నాయని వెల్లడైంది. దీంతో మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి, ఇన్ ఫర్టిలిటీ సమస్యలకు దారి తీయొచ్చని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికోకు చెందిన డాక్టర్ జియాఝాంగ్ జాన్ యూ ఆధ్వర్యంలోని బృందం ఇటీవల 47 కుక్కలు, 23 మంది మగవాళ్ల వృషణాల నుంచి కణజాలాన్ని సేకరించి పరీక్షించారు. దీంతో ప్రతి శాంపిల్ లోనూ మైక్రోప్లాస్టిక్స్ (5 మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజు ఉండే ప్లాస్టిక్ కణాలు) బయటపడటంతో వారు షాక్ అయ్యారు. పాలిథీన్, పీవీసీ వంటి మొత్తం 12 రకాల మైక్రోప్లాస్టిక్స్ వృషణాల్లోకి చేరినట్టు వారు గుర్తించారు.
మరింత విస్తృత స్టడీలు జరగాలి..
వృషణాల్లోకి మైక్రోప్లాస్టిక్స్ చేరడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవచ్చని, తద్వారా ఇన్ ఫర్టిలిటీ సమస్యలు రావచ్చని జాన్ యూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మొదటగా మేం జంతువుల పునరుత్పత్తి వ్యవస్థలోకి మైక్రోప్లాస్టిక్స్ చొచ్చుకెళ్తాయా? అన్న కోణంలో పరిశోధన చేశాం. కుక్కల వృషణాల నుంచి టిష్యూ శాంపిల్స్ తీసి టెస్ట్ చేశాం. ప్రతి శాంపిల్ లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉంటం చూసి సర్ ప్రైజ్ అయ్యాను. తర్వాత మగవారి వృషణాల నుంచీ శాంపిల్స్ తీసి టెస్ట్ చేశాం. దీంతో మనుషుల్లోనూ ప్రతి ఒక్కరి వృషణాల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉండటం చూసి షాక్ అయ్యాం. ఇంతటి సెన్సిటివ్ ఆర్గాన్స్ లోకి సైతం మైక్రోప్లాస్టిక్స్ చేరడం అనేది చాలా ఆందోళనకరమైన విషయం. అందుకే మగవారి సంతానోత్పత్తి సామర్థ్యంపై మైక్రోప్లాస్టిక్స్ ప్రభావం ఎలా ఉంటుంది? నివారణకు ఏం చేయాలి? అనేదానిపై మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉందని మా రీసెర్చ్ తో తేలిపోయింది” అని ఆయన స్పష్టం చేశారు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల టాక్సికాలజికల్ సైన్సెస్ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.