ఫిజిక్స్ పరంగా ఇప్పటిదాకా నాలుగు శక్తులే
కొత్త శక్తిని కనుగొన్న హంగరీ ఫిజిక్స్ సైంటిస్టులు
దాని బరువు 17 మెగాఎలక్ట్రాన్వోల్టులు
మనల్ని డార్క్మ్యాటర్తో కలుపుతున్నది అదేనన్న భావన
భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు.. మనం చెప్పుకునే పంచభూతాలు. మన బతుకుకు అవే ఆధారం. కానీ, ఎన్నెన్నో రహస్యాలను కడుపులో దాచుకున్న విశ్వాన్ని మాత్రం ఫిజిక్స్ పరంగా చెప్పుకుంటే కేవలం నాలుగు శక్తులే శాసిస్తున్నాయి. అది ఇప్పటిదాకా. ఇకపై ఆ నాలుగు శక్తులకు ఇంకో శక్తి జత కాబోతోంది. అవును, విశ్వంలో కొత్తగా మరో శక్తిని సైంటిస్టులు కనుగొన్నారు. ప్రస్తుతం గురుత్వాకర్షణ (గ్రావిటీ) శక్తి, విద్యుదయస్కాంత శక్తి (ఎలక్ట్రోమాగ్నెటిజం), బలహీనమైన అణు శక్తి (వీక్ న్యూక్లియర్ ఫోర్స్), బలమైన శక్తి (స్ట్రాంగ్ ఫోర్స్)లే విశ్వంలో ఉన్నాయి. మరి, ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టిన ఆ కొత్త ఐదో శక్తి ఏంటి? అది ఎక్కడి నుంచి పుడుతోంది? దాని ప్రభావమేంటి?
అదో పార్టికల్
హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఆటమ్కీ)లోని న్యూక్లియర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు ఆ ఐదో శక్తిని కనుగొన్నారు. ఎటిలీ క్రాష్నాహోర్కే నేతృత్వంలోని సైంటిస్టులు ఆ శక్తేంటో వివరించారు. దానిని ‘ఎక్స్17’ అని పిలుస్తున్నారు. సూర్యుడి నుంచి వెలువడిన హీలియం, అది క్షీణించే కొద్దీ లైట్‌గా ఎలా మారుతోందో తెలుసుకోవడం కోసం సైంటిస్టులు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, అది ఫిజిక్స్‌కు అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఆ హీలియం నుంచి పార్టికల్స్ వెలువడుతున్నాయని గుర్తించినా అవేంటో వివరించలేకపోతున్నారు. ఆ పార్టికల్స్ అసాధారణ రీతిలో 115 డిగ్రీల కోణంలో స్ప్లిట్ అవుతున్నట్టు తేల్చారు. కానీ, తాజా పరిశోధనల్లో ఆ హీలియం నుంచి విడిపోతున్న వాటి నుంచే ఈ ఎక్స్17 అనే కొత్త పార్టికల్‌ను కనుగొన్నారు. దానికి ‘17’ అని జత చేయడానికి కారణం ఉంది. ఆ పార్టికల్ 17 మెగాఎలక్ట్రాన్వోల్టుల ద్రవ్యరాశి (బరువు)తో ఉందట. అందుకే ఏంటో తెలియని ఆ పార్టికల్కు ‘ఎక్స్17’ అని పేరు పెట్టేశారు. ఆ ఎక్స్17 పార్టికలే మనకు కనిపించే ప్రపంచాన్ని, కనిపించని సుదూర విశ్వంలో ఉన్న డార్క్మ్యాటర్తో కలుపుతోందని భావిస్తున్నారు.
2016 నుంచే పరిశోధనలు
సరిగ్గా మూడేళ్ల క్రితం అంటే 2016లో హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సైంటిస్టులే ఈ ఐదో శక్తిపై పరిశోధనలు ప్రారంభించారు. అప్పుడు బెరీలియం–8 అనే ఐసోటోప్ కేంద్రంగా స్టడీలు చేశారు. ఆ బెరీలియం–8 నుంచి ఎలక్ట్రాన్లు, పొజిట్రాన్లు అసాధారణ రీతిలో 140 డిగ్రీల కోణంలో విడిపోతున్నట్టు గుర్తించారు. అయితే, ఆ కొత్త పార్టికల్‌ను ఎవరూ ఒప్పుకోలేదు. దాన్ని బలంగా నమ్మించడం కోసం పార్టికల్ ఫిజిక్స్ ‘స్టాండర్ట్ మోడల్’ లేనే లేదంటూ కొందరు కొట్టిపారేశారు. దానిని మరింత విశ్లేషించాల్సి ఉందని చెప్పారు. అందుకే మరింత లోతుగా ఆ పార్టికల్స్‌పై పరిశోధన చేశారు. అలా చేస్తున్న సందర్భంలోనే ఈ ఎక్స్–17 పార్టికల్ ఆనవాళ్లను గుర్తించారు. అయితే, క్రాష్నాహోర్కే కనిపెట్టిన ఆ కొత్త పార్టికల్ విషయాలు కొత్తగా ఉండడంతో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ జొనాథన్ ఫెంగ్ దానిని ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి క్రాష్నాహోర్కే పరిశోధనలను ఆయన ఫాలో అవుతూనే ఉన్నారు.
ఫొటోఫోబిక్ ఫోర్స్
ఇప్పటివరకూ చూడని ఈ కొత్త శక్తిని ఫొటోఫోబిక్ ఫోర్స్ అనీ సైంటిస్టులు భావిస్తున్నారు. వెలుతురు అంటే భయపడేదని దాని అర్థం. దీనిపై చాలా మంది సైంటిస్టులు పెదవి విరిచారు. ఇప్పుడు కొందరు న్యూక్లియర్ సైంటిస్టులు ఇది ఐదో శక్తి కాదు అని కొట్టిపారేయడానికి లక్షల కోట్లలో ఒక వంతు చాన్స్ మాత్రమే ఉందని ఫెంగ్ అంటున్నారు. ఈ బెరీలియం, హీలియం అణువులకు తోడుగా మూడో రకం కొత్త పార్టికల్‌ను వేరే సైంటిస్టులు కనిపెడితే ఈ పరిశోధన మరింత ముందుకు కదులుతుందని అంటున్నారు. ఇక, దీనికి పేరు పెట్టేందుకూ కసరత్తులు జరుగుతున్నాయి. ఈ కొత్త పార్టికల్ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చో తెలుసుకునే ప్రయత్నాలూ సాగుతున్నాయి. ఇదివరకు ఐన్‌స్టీన్ లాంటి మేధావి దీనిపై దృష్టి పెట్టి తెలుసుకోలేకపోయిన పార్టికల్‌ను క్రాష్నాహోర్కే టీం కనిపెట్టిందని కొనియాడుతున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా..? విశ్వం కేవలం ఐదో శక్తితోనే ఆగిపోదని, అందులో ఆరు, ఏడు, ఎనిమిది.. ఇంకా ఇంకా శక్తులు ఉండే ఉంటాయని క్రాష్నాహోర్కే టీం అంటోంది.