చార్జింగ్ చేసుకొని బ్యాటరీ తినొచ్చు.. ఇటలీ సైంటిస్టుల సరికొత్త ఆవిష్కరణ.. 

చార్జింగ్ చేసుకొని బ్యాటరీ తినొచ్చు.. ఇటలీ సైంటిస్టుల సరికొత్త ఆవిష్కరణ.. 
  • చార్జింగ్ చేసుకొని బ్యాటరీ తినొచ్చు
  • ఇటలీ సైంటిస్టుల సరికొత్త ఆవిష్కరణ.. 
  • ఫుడ్ క్వాలిటీని తెలుసుకునే అవకాశం

న్యూఢిల్లీ : ఇటలీ సైంటిస్టులు సరికొత్త రీచార్జెబుల్ బ్యాటరీని తయారు చేశారు. దీంతో మనం చిన్నపాటి ఎల్ఈడీ బల్బును వెలిగించొచ్చు. బ్యాటరీలో చార్జింగ్ అయిపోయాక ఎంచక్కా తినేయొచ్చు కూడా.. ఎందుకంటే సైంటిస్టులు ఆ రీచార్జెబుల్ బ్యాటరీని మనం రోజూ తినే ఫుడ్ ఐటెమ్స్ తో తయారు చేశారు. దీనికి ‘‘ఎడిబుల్ అండ్ రీచార్జెబుల్ బ్యాటరీ”అని పేరు పెట్టారు. దీని సాయంతో చిన్నపాటి ఎలక్ట్రానిక్​ వస్తువులను కూడా చార్జ్ చేసుకోవచ్చు. రీచార్జెబుల్ బ్యాటరీని తినేసినా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అంటున్నారు. 

దీన్ని బాదం, కేపర్స్, ఆల్గే, ఫుడ్ సప్లిమెంట్స్ వంటి ఐటెమ్స్​తో తయారు చేశారు. ఇదొక ప్రొటోటైప్​ బ్యాటరీ. ఇందులో 0.65 వోల్ట్స్ కరెంట్ ఉంటుంది. లేదంటే 12 నిమిషాల దాకా 48 మైక్రోయాంపియర్ బల్బు వెలిగించొచ్చు. ప్రపంచంలోని మొట్టమొదటి ఎడిబుల్ రీచార్జెబుల్ బ్యాటరీ ఇదే అని, ఆరోగ్య సంబంధమైన విశ్లేషణలు చేయడానికి తోడ్పడుతుందని ఇటాలియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీలో మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ సైంటిస్ట్​గా పని చేస్తున్న మారియో కైరోనీ తెలిపారు. ఆహార నాణ్యతను కూడా ఇది తెలియజేస్తుందన్నారు. 

ఐస్​క్రీమ్ లాంటి ఆకారం

ఈ బ్యాటరీ చూసేందుకు ఐస్​క్రీమ్​లానే ఉంటుంది. బాడీలో ఉపయోగించే చిన్న చిన్న మెడికల్ ఎలక్ట్రానిక్​ డివైజ్​లను కూడా చార్జ్ చేయగలదు. తినగలిగే ఎలక్ట్రానిక్​ సర్క్యూట్స్, సెన్సార్​లనూ తాము తయారు చేస్తున్నామని కైరోనీ వివరించారు.