డేంజర్ లో మన ఫ్యూచర్... క్లైమేట్ సైంటిస్టుల హెచ్చరిక

డేంజర్ లో మన ఫ్యూచర్... క్లైమేట్ సైంటిస్టుల హెచ్చరిక
  • భూగోళంపై భారీగా పెరుగుతున్న సీవోటూ, మీథేన్ ఉద్గారాలు
  • తగ్గించకుంటే కష్టమేనంటూ క్లైమేట్ సైంటిస్టుల హెచ్చరిక

న్యూయార్క్: ఓ పక్క అమెరికాలో వరుసగా హరికేన్లు ఏర్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోపక్క ఇండియాలో టెంపరేచర్లు 50 డిగ్రీలకు పెరుగుతూ హీట్ వేవ్స్ తో బెంబేలెత్తిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా తలెత్తిన క్లైమేట్ చేంజ్ సమస్యకు రెండు ఉదాహరణలు ఇవి. నిజానికి గ్లోబల్ వార్మింగ్ సమస్య ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది. కానీ ఇప్పుడది డేంజర్ లెవల్ కు చేరిపోయిందని క్లైమేట్ సైంటిస్టులు వెల్లడించారు. ముఖ్యంగా సీవోటూ, మీథేన్ ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోయాయని, ఫలితంగా భూగోళం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిపారు.

ఇప్పటికిప్పుడు సీవోటూ, మీథేన్ ఉద్గారాలకు అడ్డుకట్ట వేయకపోతే గనక మానవాళి భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. భూగోళానికి క్షేమకరమైన 35 కీలక అంశాలను స్టడీ చేసిన అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్ట్ విలియం రిపుల్ ఆధ్వర్యంలోని బృందం ఈ ఈ మేరకు ‘బయోసైన్స్’ జర్నల్ లో ఒక నివేదికను పబ్లిష్ చేసింది. 2023వ ఏడాదిలో భూమి వాతావరణం సేఫ్ జోన్ లో ఉండేందుకు అవసరమైన 35 అంశాలను వీరు స్టడీ చేయగా.. అందులో 25 అంశాలు ప్రతికూలంగా మారుతున్నాయని గుర్తించారు.

జనాభా, పశువుల పెరుగుదలే పెద్ద సమస్య.. 

సీవోటూ, మీథేన్ ఉద్గారాల పెరుగుదలకు జనాభా, పశువుల సంఖ్య పెరగడమే ప్రధాన కారణమని సైంటిస్టులు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా రోజూ 2 లక్షల మంది పుడుతూ, జనాభా వృద్ధి రేటు ప్రమాదకర స్థాయికి చేరింది. అలాగే రోజూ 1.70 లక్షల పశువులు, గొర్రెలు పెరుగుతున్నాయి. జనాభా, పశువుల పెరుగుదల వల్ల గ్రీన్ హౌస్ వాయువులు అత్యధికంగా విడుదలవుతున్నాయి. సీవోటూ కంటే మీథేన్ 80 రెట్లు ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతోంది.

మీథేన్ ప్రధానంగా శిలాజ ఇంధనాల వాడకం, వ్యర్థాల డంపులు, పశువుల పెంపకం, వరి సాగు వల్ల ఎక్కువగా ఏర్పడుతోంది. మరోవైపు ధ్రువాల వద్ద మంచు కూడా భారీగా కరిగిపోతోంది. ఆ మంచులో నిక్షిప్తమై ఉన్న గ్రీన్ హౌస్ వాయువులు విడుదలై వాతావరణంలోకి చేరుతున్నాయి” అని నివేదికలో పేర్కొన్నారు. ‘‘ఇప్పటికైనా శిలాజ ఇంధనాల వాడకాన్ని నియంత్రించాలి. మాంసాహారానికి బదులుగా శాకాహార వినియోగం పెంచాలి. లేకపోతే గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగి, మానవాళి భవిష్యత్తుకే ముప్పు తప్పదు” అని సైంటిస్టులు హెచ్చరించారు.