భూమిపై పొల్యూషన్, దుమ్ము, ధూళినే కాకుండా మనకు తెలియకుండా కంటికి కనిపించనంత చిన్న సైజులో స్పేస్ డస్ట్ కూడా ఉంటుంది. స్పేస్ నుంచి ఏటా 5,200 టన్నుల వరకు కాస్మిక్ డస్ట్ కిందికి వచ్చి చేరుతోందని సైంటిస్టుల రీసెర్చ్‌లో తేలింది. ఇందులో ఎక్కువ భాగం తోక చుక్కలు రాలిపోయినప్పుడు భూమిపైకి వచ్చే వేస్ట్ ఉంటోందని గుర్తించారు. ఈ స్పేస్ డస్ట్ వల్ల భూమిపై ఎవరికీ, ఎటువంటి ప్రమాదం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.
అంటార్కిటికాలో రీసెర్చ్
భూమి మీదకు నిత్యం స్పేస్ డస్ట్ కంటికి కనిపించని వర్షంలా కురుస్తూనే ఉంటుంది. ఈ విషయం సైంటిఫిక్‌గా ఎప్పుడో రుజువైంది. కానీ అది ఎంత మొత్తంలో ఇలా కురుస్తుందనేదే ఎన్నో ఏండ్లుగా అంచనా వేయలేకపోయారు. కారణం భూమి మీద మన చుట్టూ వాతావరణంలో ఏ సెకన్‌లో చూసినా 1.7 కోట్ల టన్నుల డస్ట్ ఉంటుంది. పరిశ్రమలు, వెహికల్స్, ఇతర రకాల కాలుష్యం, ఇలా వాతావరణంలో రెగ్యులర్‌గా ఉండే డస్ట్ వల్ల కాస్మిక్ డస్ట్‌ను ప్రత్యేకంగా గుర్తించడం కష్టం. అందుకే ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎఫ్ఎస్‌ఆర్) నేతృత్వంలో ఇంటర్నేషనల్ సైంటిస్టుల టీమ్ 20 ఏండ్ల పాటు ఎటువంటి దుమ్ము, ధూళికి ఆస్కారం లేని అంటార్కిటికాలోని డూమ్ సీ అనే ప్రాంతంలో దీనిపై పరిశోధనలు జరిపారు.
0.7 మిల్లీమీటర్ల సైజులో..
భూమిపై మట్టి, దుమ్ము ఉన్నట్టు అంతరిక్షంలో తిరుగుతూ ఉండే గ్రహశకలాలు, ఉల్కలు, తోక చుక్కలు, నక్షత్రాలు, ఇలా అనేక రకాల మార్గాల ద్వారా కాస్మిక్ డస్ట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే వీటిలో ఎక్కువగా ఉల్కాపాతం, తోక చుక్కలు రాలిపోవడం వంటి సందర్భాల్లోనే భూమిపైకి వాటి భాగాలు వచ్చి పడుతుంటాయి. కొన్ని కిలోల బరువు ఉండే రాళ్లు లాంటివి కూడా వాటి నుంచి నేలపై పడిన సందర్భాల్లో, సైంటిస్టులు సేకరించి రీసెర్చ్ చేస్తుంటారు. అయితే చాలా సమయాల్లో అవి అసలు భూమిని చేరేలోపే ఆవిరైపోతాయి. ఈ క్రమంలో చిన్న చిన్న దుమ్ము కణాల రూపంలో మన వాతావరణంలోకి అతి కొద్ది శాతం మాత్రమే వచ్చి చేరుతాయి. అలా వచ్చే 0.7 మిల్లీమీటర్ల (0.027 అంగుళాల) సైజు ఉంటాయని సైంటిస్టుల టీమ్ గుర్తించింది. ఇవి 30 నుంచి 200 మైక్రో గ్రాముల వరకు బరువు ఉన్నట్టు చెప్పారు. ఇవి ఏడాది మొత్తంలో కలిపి 5200 టన్నుల వరకు ఉంటాయని వారు తేల్చారు. వాస్తవానికి ఏటా 15 వేల టన్నులకుపైగా స్పేస్ డస్ట్ భూమి వైపు వస్తోందని, అయితే అందులో మూడొంతుల వరకూ మన వాతావరణంలోకి వచ్చే లోపే కరిగిపోతోందని సైంటిస్టులు తెలిపారు. అయితే భూమిని చేరే మొత్తం కాస్మిక్ డస్ట్‌లో 80 శాతం తోక చుక్కల నుంచి వచ్చేదేనని తమ అధ్యయనంలో తేలిందన్నారు. అంటార్కిటిక్‌లో సేకరించిన చిన్న చిన్న మెట్రాయిట్ ముక్కలపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. వీటి సాయంతో కాస్మిక్ ఎన్విరాన్‌మెంట్ గురించి లోతుగా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ వివరాలను సైంటిస్టులు ఎర్త్ అండ్ ప్లానెటరీ లెటర్స్ జర్నల్‌లో పబ్లిష్ చేశారు.