హైదరాబాద్ సిటీ, వెలుగు: బుధవారం ఉదయం 7.27 నిమిషాలు.. పిల్లలు స్కూళ్లకు, పెద్దలు ఆఫీసులకు వెళ్లేందుకు సిటీ అంతా బిజీబిజీగా ఉన్న వేళ.. హైదరాబాదీలను భూకంపం భయపెట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, రాజేంద్రనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, బొంగ్లూర్, కొంగరకలాన్,అల్వాల్ తదితర ప్రాంతాల్లో ఒకటి, రెండు సెకన్లపాటు ఒక్కసారిగా భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
కాసేపటికి గోదావరి సమీప ప్రాంతంలోని ములుగు వద్ద రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూమి కంపించినట్లు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్, -ఎన్‌జీఆర్‌ఐ సైంటిస్టులు ప్రకటించారు. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ వరకు దీని ప్రభావం ఉన్నట్లు చెప్పారు. ఈ భూకంపంతో సిటీలో ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అయితే, భూకంపాల పరంగా హైదరాబాద్ ఎంత సేఫ్..?అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మొదలైంది.
మనకు భూకంపాల భయం లేదు
గతంలో చెప్పినట్టుగానే భూకంపాల పరంగా హైదరాబాద్ సేఫ్‌జోన్‌లోనే ఉన్నట్టు సెంటిస్టులు చెప్తున్నారు. తెలంగాణకు భూకంపాల భయంలేదని, మన ప్రాంతం దక్కన్ పీఠభూమిలో సముద్రానికి ఎత్తులో ఉందని, ప్రజలు నిర్భయంగా ఉండొచ్చంటున్నారు. భూమి కంపించడం అనేది సర్వ సాధారణం. అయితే, ఏ స్థాయిలో ప్రకంపనలు వస్తున్నాయన్న దాన్ని బట్టి దేశాన్ని నాలుగు కేటగిరీలుగా విభజించారు.
అంటే, ఎంత తీవ్రతతో భూమి కంపిస్తే, ఎంత నష్టం జరుగుతుందో చెప్పే ఒక టేబుల్ ఇది. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూమి కంపిస్తే జోన్-5గా, 6-–7 రేంజ్‌లో వస్తే జోన్- 4గా, 5తో వస్తే జోన్- 3గా, 1 – 4 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉంటే దాన్ని జోన్-2. వీటిలో జోన్-5 అత్యంత భూకంప ప్రభావమున్న ప్రాంతం. జోన్ 2లో సాధారణంగా భూకంపాలు రావు. ఈ జోన్ 2లోనే మన హైదరాబాద్ ఉందని సైంటిస్టులు తెలిపారు.
జాగ్రత్తలు అవసరం
మనం జోన్ 2లో ఉన్నప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో నిత్యం హైరైజ్ భవనాలను జోన్ –3 ప్రాంతాలకు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నిర్మించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు చిన్నపాటి ప్రకంపనలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. రిక్టర్ స్కేల్‌పై దాదాపు 6 తీవ్రతతో భూకంపం వస్తే భూకంప కేంద్రానికి 15 కిలోమీటర్ల వరకు గోడలు కూలిపోయి భవనాలు పగుళ్లు ఏర్పడతాయన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో 4.8 (2020లో), 4.6 (2024 మార్చి), 4.5 (2022లో) తీవ్రతతో భూమి కంపించినట్లు చెప్పారు.
జనాభా పెరగడం, భారీ ప్రాజెక్టులతో భూకంపాల ఎఫెక్ట్ కనిపిస్తోందన్నారు. ఒకవేళ సిటీలో భారీ భూకంపం వస్తే తలదాచుకోవడానికి దగ్గర్లో పెద్దపెద్ద మైదానాలు సైతం లేవని అంటున్నారు. అగ్గిపెట్టలాంటి ఇండ్లు, ఇరుకు గల్లీలతో భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత మారుతున్న కాలానికి అనుగుణంగా జాగ్రత్త పడాలంటున్నారు. భవన నిర్మాణాల్లో కచ్చితంగా సేఫ్టీ పాటించాలని, జోన్3 ప్రమాణాలతో ఇండ్లు కట్టుకోవాలని సూచిస్తున్నారు.1500 నుంచి 2 వేల ఫీట్ల వరకు బోర్లు వేస్తున్నారని, దీని ప్రభావంతోనూ భూకంపం రావొచ్చని అంటున్నారు.