మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ గ్వాలియర్‌లో అధ్వాన్నంగా రోడ్లను బాగుచేయాలంటూ వినూత్ననంగా నిరసన తెలిపారు. గత 56 రోజులుగా ఆయన కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నారు. ఆయన నిరసనతో ఇటీవల రోడ్ల మరమ్మతులు ప్రారంభమయ్యాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రద్యుమన్ సింగ్ తోమర్ కు కొత్త చెప్పులు అందించారు. అనంతరం జ్యోతిరాదిత్య పాదాలకు ప్రద్యుమన్ నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. త్వరలోనే ఆ రోడ్లు అద్భుతంగా ఉండబోతున్నాయని జ్యోతిరాదిత్య స్పష్టం చేశారు.
ప్రద్యుమన్ సింగ్ తోమర్ గ్వాలియర్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్టోబరు నెలలో ఆయన అక్కడ ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు స్థానికులు ఆయన వద్దకు వచ్చి నగరంలోని గుంతల గురించి తమ కష్టాలను వివరించారు. నగరంలోని రోడ్లు మెరుగుపడే వరకు తాను చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. రోడ్లను త్వరగా మరమ్మతులు చేసేలా ప్రతిరోజూ పనులను పర్యవేక్షిస్తానని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తాను కూడా అనుభవించాలి కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా ప్రద్యుమాన్ సింగ్ ఆ రోజు తెలిపారు.