సత్తుపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంటలో ఆస్తిని పంచలేదని ఇంటికి తాళం వేసి తల్లిదండ్రులను కొడుకులు గెంటేశారు. గ్రామానికి చెందిన తాటి ముత్యాలు, ఆదిలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు నాగరాజు, హనుమంతు, రాంబాబు, ఇద్దరు బిడ్డలు. బిడ్డల పెళ్లి చేసి పంపగా ఉన్న 8.5 ఎకరాల భూమిలో ముగ్గురు కొడుకులకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ఇచ్చి మిగిలిన భూమిలో తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ముగ్గురు కొడుకులు తమ అత్తగారిళ్లల్లో ఉంటున్నారు.
ముత్యాలు ఆరోగ్యం బాగాలేకపోవడంతో చిన్న కొడుకు రాంబాబు దవాఖానకు తీసుకువెళ్లి బాగోగులు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో తండ్రి ఆస్తి చిన్న కొడుక్కే దక్కుతుందన్న ఆలోచనతో మిగిలిన ఇద్దరు కొడుకులు వచ్చి ఆస్తి మొత్తం సమానంగా పంచాలని, లేనిపక్షంలో ఊరుకునేదిలేదని తల్లిదండ్రుల ఇంటికి తాళం వేసి వారిని బయటకు గెంటేశారు.
గతంలో కూడా ఇలానే జరిగితే ఆ వృద్ధ దంపతులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే పెద్దమనుషులు పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. అయినా ఇద్దరు కొడుకులు వినకుండా ఇటీవల తల్లిదండ్రులను బయటకు పంపి తాళం వేయడంతో దిక్కుతోచని స్థితిలో వృద్ధ దంపతులు ఇంటి ముందే ఉంటున్నారు.