
తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9గంటలనుంచి ఎండవేడిమికి ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్ 27) కొన్ని జిల్లాల్లో వర్షం కురవగా మరికొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొట్టాయి. జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అయ్యాయి. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెంలో వరి కోత కోస్తున్న హార్వెస్టర్ అగ్ని ప్రమాదానికి గురైంది.
గ్రామానికి చెందిన పెడిమల గంగాధర్ పొలంలో వరికోస్తుండగా.. అధిక ఉష్ణోగ్రతలకు వరికోత మిషన్ హార్వెస్టర్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. పొల మధ్యలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. హార్వెస్టర్ నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో అటు పొలం యజమాని, హార్వెస్టర్ యాజమానితోపాటు స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. మంటలు ఆర్పేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. సమీపంలో నీళ్లు కూడా లేకపోవడంతో హార్వెస్టర్ సగానికి పైగా దగ్ధమైంది.
►ALSO READ | హైదరాబాద్ సిటీలో మే1 నుంచి సన్న బియ్యం పంపిణీ