రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దీపావళి, ఛత్ పూజలను దృష్టిలో ఉంచుకుని 804 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల అధిక రద్దీ నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. గత దీపావళి పండగకు ప్రకటించిన స్పెషల్ రైళ్ల కంటే ఈ ఏడాది 28 శాతం అధిక రైల్ సర్వీస్ లను నడుపుతున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. మొత్తం దేశ వ్యాప్తంగా 6,560 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది ఇండియన్ రైల్వే.
పండుగ సీజన్‌లో నార్త్ స్టేట్స్ కు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ , ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు ప్రయాణికుల రద్దీ ఉంటుంది. దీంతో ప్రయాణికుల డిమాండ్ల మేరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ వంటి దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్ల నుంచి ఈ రైళ్లు నడవనున్నాయి.
ALSO READ | రైల్వే ప్రయాణికులకు అలర్ట్: దానా తుపాన్ ఎఫెక్ట్‌తో 34 రైళ్లు రద్దు
షాలిమార్, రక్సాల్, జైపూర్, లాల్‌గఢ్, హిసార్, వంటి ఇతర రాష్ట్రాల్లోని స్టేషన్ల మీదుగా కాచిగూడ, గోరఖ్‌పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చి , మదురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వేల్, దాదర్ వంటి స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు వెళ్లనున్నాయి.
ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ కోచ్ లతో నడుపుతున్నారు. కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా టిక్కెట్లను మొబైల్ యాప్ లో యూటీఎస్ ద్వారా కొనుగోలు చేసుకొనే అవకాశం కల్పించారు.