ఆర్ యూఆర్ రెడీ .. ట్రయల్ ​రన్ ​పూర్తి చేసిన అధికారులు

ఆర్ యూఆర్ రెడీ  .. ట్రయల్ ​రన్ ​పూర్తి చేసిన అధికారులు
  • మరోచోట రైల్వే బైపాస్​కోసం భూసేకరణకు కసరత్తులు​ 
  • కాజీపేట పరిధిలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రాజెక్టులు
  • జంక్షన్ పై ట్రాఫిక్ తగ్గించేందుకు చర్యలు

హనుమకొండ, వెలుగు: ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే కాజీపేట రైల్వే జంక్షన్ పై రైళ్ల రద్దీ పెరుగుతోంది. సికింద్రాబాద్, విజయవాడ, ఢిల్లీ వెళ్లే మార్గాలకు 'వై' జంక్షన్ కావడంతో మూడు వైపులా వచ్చే రైళ్లతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీంతో రైళ్ల హాల్టింగ్, క్రాసింగ్ తో రాకపోకలకు అంతరాయం ఏర్పడటమే కాకుండా ప్రయాణికులు కూడా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే కాజీపేట జంక్షన్ సమీపంలో రెండు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. 

కాజీపేట సమీపంలోని వడ్డేపల్లి చెరువు సమీపంలోని ఉనికిచెర్ల గేట్​-కోమటిపల్లి సమీపంలో ఇప్పటికే మొదలుపెట్టిన రైల్ అండర్ రైల్(ఆర్​యూఆర్​) ప్రాజెక్టు పూర్తికాగా, గూడ్స్ ట్రైన్ ట్రాఫిక్ తో కాజీపేట జంక్షన్ తో ఇబ్బందులు తలెత్తకుండా నష్కల్ టు హసన్ పర్తి బైపాస్ లైన్ కు అడుగులు వేస్తోంది. ఈ మేరకు మూడు రోజుల కిందట రైల్వే శాఖ నుంచి ఆదేశాలు అందడంతో భూసేకరణకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు వినియోగంలోకి వస్తే కాజీపేట జంక్షన్ పై రైళ్ల ట్రాఫిక్ సమస్యకు ఫుల్ స్టాప్ పడనుంది.

340 మీటర్ల మేర సొరంగమార్గం..

సౌత్ సెంట్రల్ రైల్వేలో కీలక జంక్షన్ అయిన కాజీపేట మీదుగా నిత్యం గూడ్స్, ప్యాసింజర్లు కలిపి దాదాపు 250 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఢిల్లీ వైపు నుంచి వచ్చే రైలు మార్గం కాజీపేట సమీపంలోని వడ్డేపల్లి వద్ద 'వై' ఆకారంలో చీలిపోతుంది. కుడి వైపు కాజీపేట మీదుగా సికింద్రాబాద్, ఎడమవైపు కాజీపేట ఫాతిమా జంక్షన్​ మీదుగా వరంగల్, విజయవాడ వెళ్లే మార్గం ఉంటుంది. వై జంక్షన్ సెంటర్ పాయింట్ గా ఉన్న వడ్డేపల్లి చెరువు వద్ద ఒక రైల్ ఆలస్యాన్ని నియంత్రించేందుకు ఇంకో దానిని నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 

దీంతోనే హాల్టింగ్, క్రాసింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే కాజీపేట-, హసన్ పర్తి రోడ్డు,  మార్గంలో వడ్డేపల్లి చెరువు సమీపంలోని ఉనికిచెర్ల రైల్వే గేట్ నుంచి కోమటిపల్లి వరకు దాదాపు 340 మీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటుకు ప్లాన్​చేసి, దాదాపు రూ.35.7 కోట్లతో పనులు పూర్తి చేసింది. దేశంలో వివిధ చోట్ల రైల్వే సొరంగ మార్గాలు ఉండగా, తెలంగాణలో మాత్రం ఇదే మొదటిదని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే అండర్ గ్రౌండ్ టన్నెల్ వర్క్స్, ట్రాక్, ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి కావడంతో రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఇటీవలే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. తొందర్లోనే ఈ సొరంగ మార్గాన్ని వినియోగంలోకి తీసుకురానున్నారు.

నష్కల్ టు హసన్ పర్తి బైపాస్..​

ఢిల్లీతోపాటు విజయవాడ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే గూడ్స్ రైళ్లు కూడా కాజీపేట జంక్షన్​ మీదుగానే వెళ్తుండటంతో ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతోనే గూడ్స్ రైళ్లు కాజీపేట జంక్షన్​లోకి ఎంటర్ కాకుండా నష్కల్ నుంచి హసన్ పర్తి రోడ్డు(ఎల్లాపూర్​) వరకు, నష్కల్ నుంచి విజయవాడ రూట్ లోని చింతలపల్లికి మరో బైపాస్ లైన్ కు గతంలోనే ప్రపోజల్స్ పెట్టారు. మొదటి ప్రాధాన్యంగా హసన్ పర్తి రోడ్డు టు నష్కల్ మార్గంలో బైపాస్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేసి, ఇదివరకు నష్కల్​ నుంచి ఎన్​హెచ్-163 కి సమాంతరంగా బైపాస్​ లైన్ వేసేందుకు ప్రతిపాదించారు. 

ఆ తర్వాత అలైన్ మెంట్ మార్చేసి జనగామ జిల్లా పరిధిలోకి వచ్చే నష్కల్, చిల్పూరు నుంచి హనుమకొండ జిల్లా పరిధిలోని ధర్మసాగర్​ మీదుగా హసన్ పర్తి వరకు బైపాస్ ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.24.55 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గంలో భూసేకరణ ప్రక్రియ చేపట్టాల్సిందిగా, మూడు రోజుల కిందట నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు హనుమకొండ, స్టేషన్​ ఘన్ పూర్ ఆర్డీవోలకు ఆదేశాలు అందగా, భూసేకరణ ప్రక్రియపై ఆఫీసర్లు కసరత్తు ప్రారంభించారు. 

ఇదిలాఉంటే ఇప్పటికే ఓసారి అలైన్​మెంట్ మార్చగా, తాజాగా ప్రతిపాదించిన మార్గంలో తమ విలువైన భూములకు నష్టం వాటిల్లుతుందని, ఈ మార్గాన్ని కూడా మార్చాల్సిందిగా స్థానికుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మార్గంతో పాటు నష్కల్ నుంచి మామునూరు మీదుగా గీసుకొండ మండలం చింతల్ రైల్వే స్టేషన్ వరకు మరో బైపాస్ ను కూడా ప్రతిపాదించారు.  

ట్రాఫిక్ కష్టాలకు చెక్​..

ఇప్పటికే ఉనికిచెర్ల రైల్వే గేటు నుంచి కోమటిపల్లి వరకు రైల్వే సొరంగ మార్గం పూర్తయ్యింది. మరోవైపు నష్కల్ నుంచి హసన్​పర్తి రోడ్డు, చింతలపల్లి బైపాస్ రూట్లకు భూసేకరణకు కసరత్తు ప్రారంభమైంది. ఇటు సొరంగ మార్గం వినియోగంలోకి రావడంతోపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా బైపాస్​ పనులు పూర్తయితే, కాజీపేట జంక్షన్ పై గూడ్స్ రైళ్ల ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోనుంది. 

రైళ్ల హాల్టింగ్ తోపాటు క్రాసింగ్ కష్టాలకు కూడా పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తప్పనుండగా, తొందర్లోనే బైపాస్ పనులు పూర్తి చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బైపాస్ లైన్ల అలైన్​మెంట్లు మార్చాలని స్థానిక రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.