కుంభమేళాకు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 140 స్పెషల్ ట్రైన్స్

కుంభమేళాకు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 140 స్పెషల్ ట్రైన్స్
  • ఇప్పటికే  సుమారు 1.3 లక్షల మంది ట్రావెల్
  • రద్దీ ఆధారంగా మరో నాలుగు రైళ్లను నడిపే యోచన

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌లో జరుగుతున్న మహా కుంభమేళా రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) మరో 140 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ స్పెషల్ ట్రైన్లల్లో ఇప్పటికే  సుమారు 1.3 లక్షల మంది ప్రయాణించారు. మార్చి వరకు మొత్తం 179 ప్రత్యేక రైళ్లు నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి ఇప్పటికే 140 ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. దాని అధికార పరిధిలోనే అదనంగా 39 రైళ్లు ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణిస్తున్నాయి. 

సికింద్రాబాద్, చర్లపల్లి, మౌలా-లీ, గుంటూరు, విజయవాడ, కాకినాడ, నర్సాపూర్, నాందేడ్, ఔరంగాబాద్, తిరుపతి, బీదర్, వికారాబాద్, మచిలీపట్నంతో సహా ప్రధాన ఎస్సీఆర్ స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరుతున్నాయి. రద్దీ ఆధారంగా మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు అధికారుల పరిశీలనలో ఉన్నాయి. కుంభమేళా సందర్భంగా భక్తులు సాఫీగా ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌కు చేరుకునేందుకు ఇండియన్ రైల్వే 3,000 ప్రత్యేక రైళ్లు,10 వేల సాధారణ రైళ్లు సహా 13 వేల రైళ్లను నడపాలని ప్లాన్ చేసింది.