మార్కెట్‌‌‌‌‌‌‌‌ షెడ్ల స్క్రాప్​ మాయం? 

మార్కెట్‌‌‌‌‌‌‌‌ షెడ్ల స్క్రాప్​ మాయం? 
  •     మాయమైన స్క్రాప్ విలువ రూ.10లక్షలకు పైగానే..
  •     రైతు బజార్, వ్యవసాయ మార్కెట్ షెడ్ల కూల్చివేతలో..
  •     బల్దియా, మార్కెటింగ్ శాఖల తీరుపై అనుమానాలు 
  •     తలో సమాధానం చెబుతున్న రెండు శాఖల అధికారులు 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కశ్మీర్ గడ్డ, వ్యవసాయ మార్కెట్ లో కూరగాయల మార్కెట్ల నిర్మాణం కోసం కూల్చేసిన టిన్ షెడ్లకు సంబంధించిన స్ర్కాప్ మాయమైనట్లు తెలుస్తోంది. జిల్లా మార్కెటింగ్ శాఖకు అప్పగించాల్సిన ఈ స్క్రాప్ అటు ఆ శాఖకు అందక.. ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కు చేరకపోవడం మిస్టరీగా మారింది. సుమారు రూ.10 లక్షల విలువైన మూడు టిన్ షెడ్ల స్ర్కాప్ వ్యవహారంపై రెండు శాఖల అధికారులు తలో సమాధానం ఇస్తుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఫిర్యాదులు అందినా చర్యల్లేవ్‌‌‌‌‌‌‌‌..

కరీంనగర్ స్మార్ట్ సిటీ లో భాగంగా కశ్మీర్ గడ్డ, వ్యవసాయ మార్కెట్ లో కొత్తగా రైతు బజార్ల నిర్మాణం కోసం నిరుడు టెండర్ పిలిచి, కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. పనుల్లో భాగంగా కశ్మీర్ గడ్డ రైతు బజార్ లో కూరగాయల వ్యాపారుల నీడ కోసం గతంలో ఏర్పాటు చేసిన పెద్ద టిన్ షెడ్ ను తొలగించారు. అలాగే వ్యవసాయ మార్కెట్ లో ఉన్న మరో రెండు షెడ్లను కూడా కూల్చివేశారు.

ఆ షెడ్ల స్క్రాప్‌‌‌‌‌‌‌‌ను మున్సిపల్ ఆఫీసర్లు మార్కెటింగ్ శాఖకు అప్పగించాల్సి ఉన్నా ఆ తర్వాత పట్టించుకోలేదు. గతంలో తామే ఈ షెడ్లను నిర్మించామని, అందువల్ల తామే వీటిని తీసుకుంటామని మున్సిపల్ ఇంజనీర్ ఒకరు చెప్పారని, ఆయనే కాంట్రాక్టర్ తో కలిసి స్క్రాప్ ను అమ్మేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఇదే విషయమై మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు అంది నెల రోజులు దాటినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 

ఒక్కో ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది ఒక్కో సమాధానం.. 

స్క్రాప్ మాయంపై జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ పద్మావతిని వివరణ కోరగా.. గతంలో రైతుబజార్లను మున్సిపాలిటీనే నిర్మించి తమకు అప్పగించారని తెలిపారు. అప్పుడు నిర్మాణ సమయంలో ఉన్న  ఇంజనీర్ మసూద్ అలీ.. కూల్చివేత సమయంలో కూడా ఉన్నాడని గుర్తు చేశారు. ఈ స్క్రాప్ మున్సిపాలిటీదేనని, తామే వాడుకుంటామని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.

ఇదే విషయమై మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఎస్ఈ మహేందర్ ను వివరణ కోరగా.. తొలగించిన స్క్రాప్ వివరాలు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ఏజెన్సీ అయిన ఆర్వీ అసోసియేట్స్ వద్ద ఉన్నాయన్నారు. స్క్రాప్ ఎవరికీ అమ్మలేదని, దానిని కొన్ని చోట్ల డంప్ చేసినట్లు వెల్లడించారు. ఇదే విషయమై ఆర్వీ అసోసియేట్ ప్రతినిధి సందీప్ ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు.