పాత వెహికల్​ను స్క్రాపింగ్‌‌‌‌కు ఇస్తే కొత్త బండిపై డిస్కౌంట్​

పాత వెహికల్​ను  స్క్రాపింగ్‌‌‌‌కు ఇస్తే కొత్త బండిపై డిస్కౌంట్​
  • గరిష్టంగా రూ.20 వేల వరకు
  • ప్రకటించిన ఆటో కంపెనీలు

న్యూఢిల్లీ : పాత బండిని తుక్కుగా మార్చడానికి ఇస్తే కొత్త వెహికల్​పై1.5‌‌‌‌‌‌‌‌–3 శాతం వరకు తగ్గింపు ఇవ్వడానికి ఆటోమొబైల్ కంపెనీలు ఒప్పుకున్నాయి.   కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం తరువాత, అనేక ప్యాసింజర్,  వాణిజ్య వాహనాల తయారీదారులు ఈ మేరకు ప్రకటన చేశారు.   మెర్సిడెస్ బెంజ్ ఇండియా రూ. 25 వేలు ఫ్లాట్ తగ్గింపును ఆఫర్ చేసిందని, ఇది ప్రస్తుతం ఉన్న అన్ని తగ్గింపుల కంటే ఎక్కువగా ఉంటుందని ప్రకటన పేర్కొంది.  కేంద్ర రోడ్డు రవాణా  రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఢిల్లీలో సియామ్​ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. 

ఆటోమొబైల్ పరిశ్రమలో ఉన్న ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించారు. కాలుష్యానికి కారణమవుతున్న పాత బండ్ల సంఖ్యను తగ్గించడంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. వాణిజ్య వాహన తయారీదారులు రెండేళ్ల పరిమిత కాలానికి తగ్గింపులను అందించడానికి సిద్ధంగా ఉన్నారని,  ప్యాసింజర్ వాహన తయారీదారులు ఒక సంవత్సరం పరిమిత కాలానికి తగ్గింపులను అందించడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్రం పేర్కొంది.  ఈ తగ్గింపులు వాహనాల స్క్రాపింగ్‌‌‌‌ను (తుక్కుగా మార్చడం) మరింత ప్రోత్సహిస్తాయని, తద్వారా రోడ్లపైన సురక్షితమైన వాహనాలు మాత్రమే ఉంటాయని తెలిపింది. 

ఈ కంపెనీల నుంచి డిస్కౌంట్లు

ప్యాసింజర్ వాహన తయారీదారులైన మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, కియా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్, జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్, రెనాల్ట్ ఇండియా, నిస్సాన్ ఇండియా,  స్కోడా, ఫోక్స్‌‌‌‌వ్యాగన్ ఇండియాలు పాత బండ్లపై డిస్కౌంట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. కొత్త కారు ఎక్స్-షోరూమ్ ధరలో 1.5 శాతం తగ్గింపు లేదా రూ. 20 వేలు.. వీటిలో ఏది తక్కువైతే అది ఇస్తారు. కొన్ని మోడల్‌‌‌‌లపై కంపెనీలు స్వచ్ఛందంగా అదనపు తగ్గింపులను అందించవచ్చు. 

వాణిజ్య వాహన తయారీదారులైన టాటా మోటార్స్, వోల్వో,  ఐషర్ కమర్షియల్ వెహికల్స్, అశోక్ లేలాండ్, మహీంద్రా & మహీంద్రా, ఫోర్స్ మోటార్స్, ఇసుజు మోటార్స్ కూడా పాత బండిని ఇస్తే ఎక్స్-షోరూమ్ ధరలో 3 శాతానికి సమానమైన తగ్గింపును అందిస్తాయి. 3.5 టన్నుల కంటే ఎక్కువ బరువున్న కార్గో వెహికల్స్​ కొంటేనే తగ్గింపు లభిస్తుంది.