
రమేశ్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. పొద్దంతా కంప్యూటర్ స్క్రీన్ ముందే ఉంటాడు. సాయంత్రం ఇంటికొచ్చాక భోజనం చేసి కాసేపు టీవీ చూస్తాడు. పడుకునే ముందు ఈ రోజంతా ట్రెండింగ్‌లో ఏముందో తెలుసుకోవడానికి ఫోన్లో ఏదో ఒక సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేస్తాడు. ప్రతిరోజూ ‘ఓ పది నిమిషాలు చూసి నిద్రపోతా’ అనుకుంటాడు. కానీ.. అతనికి నచ్చిన కార్లు, ఫుడ్ వీడియోలు వరుసపెట్టి రావడంతో తనను తాను మరిచిపోతాడు.
ఓ రెండు గంటలయ్యాక ‘అయ్యో ఇంత టైం అయ్యిందా!’ అనుకుని బెడ్ మీద వాలిపోతాడు. కానీ.. పడుకున్న వెంటనే నిద్ర పట్టదు. దాంతో ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తాడు. ఒక్కరోజుతో మొదలై ఇదే కొన్నాళ్లకు అతని డైలీ రొటీన్‌గా మారింది. ఇది రమేశ్ మాత్రమే కాదు.. మనలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య. ఇలా రాత్రిళ్లు స్క్రీన్ చూస్తే నిద్రలేమితోపాటు ఎన్నో ఇబ్బందులు వస్తాయంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాట్స్, టీవీలు మన జీవితంలో అంతర్భాగమయ్యాయి. చాలామంది పడుకునే ముందు గంటల తరబడి స్క్రీన్ చూస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్‌లో గడపడం లేదా గేమ్స్ ఆడటం వల్ల తెలియకుండా స్క్రీన్ టైం పెరిగిపోతోంది. అయితే.. ఈ అలవాటు నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ మధ్య చేసిన రీసెర్చ్‌ల్లో తేలింది. పడుకునే ముందు ఒక గంటసేపు స్క్రీన్ చూస్తే స్లీప్ టైం సగటున 24 నిమిషాలుతగ్గుతుందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
పడుకునే ముందు స్క్రీన్
నార్వేలో జరిగిన హెల్త్ అండ్ వెల్‌బీయింగ్ స్టడీలో భాగంగా.. పరిశోధకులు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసున్న 45,654 మందిపై రీసెర్చ్ చేశారు. అందులో ఎక్కువమంది యువకులే ఉన్నారు. వాళ్లలో దాదాపు 38,800 మంది పడుకునేముందు స్మార్ట్‌ఫోన్లు లేదా ట్యాబ్లెట్లు వాడుతున్నట్టు చెప్పారు. ఎక్కువమంది సినిమాలు, మ్యూజిక్ వీడియోలు చూడటం, గేమ్స్ ఆడడం లాంటివి చేశారు. కొందరు మాత్రం చదువుకు సంబంధించిన వీడియోలు చూశారు. ఇలా రోజూ పడుకునేముందు గంట కంటే ఎక్కువసేపు స్క్రీన్ చూసే వాళ్లలో నిద్రలేమి సమస్య తలెత్తే ప్రమాదం 59 శాతం పెరుగుతుందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
బ్లూ రేస్‌తో జాగ్రత్త
సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత మానవ శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అది మనల్ని నిద్రపోయేలా చేస్తుంది. మొబైల్, ల్యాప్‌ట్యాప్స్, ఇతర డిజిటల్ స్క్రీన్స్ నుంచి బ్లూ రేస్ విడుదల అవుతాయి. వాటిని ఎక్కువసేపు చూస్తే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. స్క్రీన్ చూడడం ఆపేసినా మెలటోనిన్ వెంటనే ఉత్పత్తి కాదు. కాబట్టి పోన్ పక్కన పెట్టిన వెంటనే నిద్ర పట్టదు. పైగా స్లీప్ క్వాలిటీ తగ్గుతుంది. ఒక అధ్యయనంలో రాత్రి 9 గంటల తర్వాత స్క్రీన్ చూసేవాళ్ల స్లీప్ సైకిల్ అస్తవ్యస్తంగా మారినట్టు తేలింది.
పిల్లలపై ఎఫెక్ట్
పెద్దలతో పోలిస్తే.. పిల్లలు చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతారు. రాత్రిపూట ఎక్కువసేపు స్క్రీన్ చూసే పిల్లల్లో నిద్రలేమితోపాటు యాంగ్జైటీ, ఏకాగ్రత లేకపోవడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. ఒక సర్వేలో 10–17 సంవత్సరాల వయసున్న పిల్లల్లో 70 శాతం మంది పడుకునే ముందు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. అది వాళ్ల చదువులపై, మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపించింది.
నిద్రలేకపోతే ఏం జరుగుంది?
నిద్ర లేమి వల్ల కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) లెవెల్స్ పెరుగుతాయి. అది ఆందోళన, చిరాకు, దీర్ఘకాలంలో డిప్రెషన్‌కు దారితీస్తుంది.
తగినంత నిద్ర లేకపోవడం వల్ల సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో మెదడు ఇబ్బంది పడుతుంది. దాంతో ఏకాగ్రత తగ్గడం, వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం లాంటి సమస్యలు పెరుగుతాయి.
►ALSO READ | స్మార్ట్ ఫోన్ యూజర్ల సేఫ్టీ కోసం గూగుల్ కొత్త ఫీచర్.. ఆటోమెటిక్ రీస్టార్ట్
విద్యార్థుల్లో కొత్త విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాస తగ్గుతుంది.
నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో తరచూ జలుబు, ఫ్లూతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఆకలిని నియంత్రించే హార్మోన్ల(గ్రెలిన్, లెప్టిన్)లో మార్పులు వస్తాయి. దాంతో ఫుడ్ ఎక్కువగా తింటారు. టైప్–2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
దీర్ఘకాలంలో బీపీ, షుగర్, ఊబకాయంతోపాటు గుండెపోటు, స్ట్రోక్ లాంటి సమస్యలకు దారితీస్తుంది.
ఏం చేయాలి?
- పడుకోవడానికి కనీసం గంట ముందు స్క్రీన్ చూడడం మానేయాలి. వీలైతే ఆ టైంలో పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం లేదా రిలాక్సింగ్ మ్యూజిక్ వినడం లాంటివి చేయడాలి.
- స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో బ్లూ లైట్ ఫిల్టర్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి. లేదంటే బ్లూ లైట్‌ని ఫిల్టర్ చేసే అద్దాలను పెట్టుకోవాలి.
- ప్రతిరోజూ ఒకే టైంలో పడుకోవడం, లేవడం వల్ల శరీరం నేచురల్ స్లీప్ సైకిల్‌కు అలవాటుపడుతుంది.
- పడుకునే గది చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే స్లీప్ మాస్క్‌లను వాడాలి.
- పిల్లలను రాత్రి 8 గంటల తర్వాత స్క్రీన్ చూడనివ్వకూడదు. వీలైతే కథలు చెప్పడం, పాటలు వినిపించడం లాంటివి చేయాలి.
- పడుకునే ముందు కెఫిన్, ఆల్కహాల్ తీసుకోకూడదు. భోజనం కూడా పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే చేయాలి.