కోర్టులోనూ గెలిచింది రాఫెల్​!

రాఫెల్  జెట్  ఫైటర్ అంటే  మామూలు  విమానం కాదు. నిజంగా  మహా ఫైటరే.  రెండు  ఇంజన్లు ఉండే  ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఒకసారి రివ్వుమని గాల్లోకి  ఎగిరితే,  శత్రువులకు  చుక్కలు చూపిస్తుంది. ప్రత్యర్థులతో తలపడితే వార్ ఒన్ సైడే. ప్రపంచంలో ఎన్నో యుద్ధ విమానాలున్నాయి. అన్నిట్లోకి  రాఫెల్ చాలా మోడర్న్. కొన్నేళ్లుగా మన దేశ రాజకీయాల్లో రాఫెల్ ఓ హాట్ టాపిక్ లా మారింది. సుప్రీం కోర్టు తీర్పుతో రాఫెల్​కు అడ్డంకులు తొలగిపోయాయి.

రాఫెల్ యుద్ధ విమానాలను కొనాలని ముందుగా నిర్ణయం తీసుకుంది మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని  యూపీఏ సర్కార్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జెట్ ఫైటర్లకు కొదవ లేదు. అయితే అప్పటికే మిగ్ జెట్ ఫైటర్ ప్లేన్లు పాతబడిపోయాయి. ఇదే టైంలో పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్  మోడర్న్  ఫైటర్ విమానాలను పోగేసుకోవడంలో దూసుకుపోతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొత్తవి కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో రాఫెల్ యుద్ధ విమానాన్ని  కొనాలన్న నిర్ణయానికి 2012లో మన్మోహన్ సింగ్ సర్కార్ వచ్చింది. టెండర్లు పిలిచిన తరువాత అతి తక్కువ కోట్ చేసిన ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ విమానాల తయారీ సంస్థను ఎంపిక చేశారు. మొత్తం 126 జెట్ ఫైటర్లు కొనడానికి రూ. 68 వేల కోట్లు అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. 2014 లో నరేంద్ర మోడీ నాయకత్వంలో  కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక రాఫెల్ ఫైల్ ముందుకు కదిలింది.యూపీఏ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లింది.మొత్తం 126 విమానాల్లో 18 విమానాలు ఫ్రాన్స్ లో తయారవుతాయని, మిగతా 108 జెట్ లను ‘హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్’ ( హాల్) సంస్థలో తయారు చేస్తామని కేంద్రం చెప్పింది. ఈ విషయమై అప్పటి డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారికర్ 2015లో పార్లమెంటులో  ప్రకటన చేశారు. డసో ఏవియేషన్ సంస్థతో ఒక ఒప్పందం కుదిరిందని కూడా చెప్పారు. ఆ తరువాత ఏడాదికే  పారికర్ మరో ప్రకటన చేశారు. మొత్తం 36 విమానాలు కొనడానికి ఇండియా, డసో ఏవియేషన్ సంస్థ మధ్య కొత్త ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. 2022 ఏప్రిల్ లోగా రాఫెల్ విమానాలు ఇండియాకు చేరుతాయన్నారు. మొత్తం ఒప్పందం విలువలో 15 శాతం అమౌంట్  ముందుగా చెల్లించాలి. సింపుల్ గా ఇదీ డసో ఏవియేషన్ సంస్థతో మనదేశం కుదర్చుకున్న ఒప్పందం.

పెరిగిన రేట్లే మేజర్ ఇష్యూ

డసో ఏవియేషన్ సంస్థతో మోడీ ప్రభుత్వం కుదుర్చుకున్న  ఒప్పందం వివాదంగా మారింది. తమ ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే మూడింతలు ఎక్కువ గా చెల్లిస్తున్నారంటూ  కాంగ్రెస్ విమర్శించింది. పాత ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం ధర రూ. 670 కోట్లు ఉంటే 2016 లో  కొత్త డీల్​ ప్రకారం విమానం రేటు రూ. 1,600 కోట్లు అవుతుందని మండిపడింది. అసలు రాఫెల్ ఒప్పందం ఓ మిస్టరీగా మారిందని ఆరోపణలు చేసింది. వాస్తవాలను బయటకు రానివ్వకుండా చేసిందని కేంద్రంపై మండిపడింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( హాల్ ) కు అవకాశం ఇవ్వకుండా అనిల్ అంబానీకి లాభం చేయడానికే ఆయన సంస్థ  రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కు ఒప్పందంలో ఆఫ్ సెట్ భాగస్వామ్యం కల్పించారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అంబానీ కంపెనీకి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రయోజనం కలిగే విధంగా రూల్స్ ను మార్చారన్నది కాంగ్రెస్  ప్రధాన ఆరోపణ.

అవిశ్వాస తీర్మానంలోనూ రాఫెల్ ప్రస్తావన

కిందటేడాది నరేంద్ర మోడీ ప్రభుత్వంపై  పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలోనూ  రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని లేవనెత్తారు అప్పటి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఒప్పందం వివరాలను బయటపెట్టాలని తాము ఎన్నిసార్లు కోరినప్పటికీ అవినీతి బండారం బయటపడుతుందన్న భయంతో  ‘నో’ చెబుతున్నారని లోక్ సభ వేదికగా  తీవ్ర ఆరోపణలు చేశారు. ఒప్పందంలో జరిగిన అవినీతిని తవ్వితీయడానికి ‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ’ ఏర్పాటు చేయాలన్న డిమాండు చేశారు. ఒప్పందం ప్రభుత్వ రహస్యాల చట్టం పరిధిలోకి వస్తుందని సర్కార్ బుకాయిస్తోందని మండిపడ్డారు. అయితే ఒప్పందం వివరాలను వెల్లడించకూడదన్న రూలేమీ ఇండియా, ఫ్రాన్స్ మధ్య లేదన్నారు.

ఒప్పందానికి 2018లో  సుప్రీంకోర్టు క్లీన్ చిట్

రాఫెల్ ఒప్పందంపై  సర్కార్ తో అమీతుమీ తేల్చుకోవడానికి ప్రతిపక్షాలు సుప్రీం కోర్టుకెళ్లాయి. ఒప్పందంపై కోర్టు కనుసన్నల్లో  దర్యాప్తు జరపాలని కోరుతూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై  విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 2018 డిసెంబర్ 14న మోడీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు చెప్పింది. డీల్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని అనుమానించడానికి ఎలాంటి ప్రాతిపదిక కనిపించడం లేదని పేర్కొంది. అంతేకాదు జెట్ ఫైటర్ల నాణ్యతపై కూడా కూలా ఎలాంటి అనుమానాలు లేవన్నది. దీంతో రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.

రివ్యూ పిటిషన్ వేసిన యశ్వంత్, అరుణ్ శౌరి

రాఫెల్ డీల్ పై మోడీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాలని కోరుతూ కొంతమంది రివ్యూ పిటిషన్ వేశాయి. మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరితో పాటు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఈ రివ్యూ పిటిషన్ వేశారు. రాఫెల్ ఒప్పందంపై సుప్రీం కోర్టుకు కేంద్రం తప్పుడు సమాచారం ఇచ్చిందని వీరు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.

 

ఎన్డీయే ఒప్పందమే  చౌక 

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్  (కాగ్) రిపోర్ట్ అంటే ప్రభుత్వాలకు వెన్నులో వణుకు పుడుతుంది. అనేక పద్దుల కింద సర్కార్లు చేసే ఖర్చులను, వివిధ పథకాల కింద ఖర్చు చేసే తీరులో అవినీతిని, అక్రమాలను  నిర్మొహమాటంగా ఎత్తి చూపే రాజ్యాంగ సంస్థ ‘కాగ్’. రాఫెల్ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని సమర్ధిస్తూ ‘కాగ్’ రిపోర్ట్ ఇచ్చింది. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందంతో పోలిస్తే ఎన్డీయే ఒప్పందమే చౌక అని ‘కాగ్’ తేల్చి చెప్పింది.

కాంగ్రెస్ ప్రధాన ప్రశ్నలు మూడు 

రాఫెల్ డీల్ పై మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మూడు ప్రధాన ప్రశ్నలు వేసి ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది.

మన్మోహన్ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు. యూపీఏ సర్కార్ హయాంలో మొత్తం 126 జెట్ ఫైటర్లను కొనుగోలు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోవలసిందో చెప్పాలి.

 ఒప్పందంలో ఆఫ్ సెట్ భాగస్వామిగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్​ లిమిటెడ్ ’ (హాల్ ) పేరును మోడీ ప్రభుత్వం ఎందుకు సూచించలేదు.

యూపీఏ సర్కార్ హయాంతో పోలిస్తే  విమానాల ఖర్చును తగ్గించామని చెబుతున్న ఎన్డీయే సర్కార్, గతంలో కుదిరిన ఒప్పందం మేరకు 126కు బదులుగా 36 విమానాలనే ఎందుకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది?

బీజేపీ వివరణ ఏంటంటే..

రాఫెల్ ఒప్పందంపై  కాంగ్రెస్ చేసిన ఆరోపణలను అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పదేపదే అవాస్తవాలను కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని అప్పటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ ను జైట్లీ తోసిపుచ్చారు. గతంలో జరిగిన రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందాలతో సంబంధం ఉన్నవారు మోడీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఒక దశలో నేషనల్ హెరాల్డ్, అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాంలను ఆయన ప్రస్తావించారు.

కాంగ్రెస్ పై నిర్మలా సీతారామన్ ఎదురుదాడి

రాఫెల్ డీల్ పై బీజేపీ తరఫున అప్పటి డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తమ వాదన బలంగా వినిపించారు. ఒప్పందంలో అవినీతి జరిగిందని రాహుల్ చేసిన ఆరోపణలను ఆమె లోక్ సభలో తిప్పికొట్టారు. అవసరమైనప్పుడు  టెక్నికల్ విషయాలను ప్రస్తావిస్తూ  కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు. యూపీఏ హయాంలో జరిగింది మామూలు విమానాల కు సంబంధించిన ఒప్పందమని, ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరిగింది ఎక్విప్డ్ విమానాల ఒప్పందం అని వివరించారు. విమానం రేట్ల విషయంలో తేడాలు రావడానికి ఇదే కారణమన్నారు.అలాగే ‘ హాల్’ ను పక్కన పెట్టి అనిల్ అంబానీ కంపెనీని ఆఫ్ సెట్ భాగస్వామిగా ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదన్నారు. ఏ సంస్థనైనా ఆఫ్ సెట్ పార్ట్ నర్ గా చేసుకునే అధికారం డసో ఏవియేషన్ సంస్థకు ఉందన్నారు. అన్నిటికంటే రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందాలు దేశ భద్రతకు సంబంధించినవన్నారు. ఇలాంటి సున్నితమైన అంశం ప్రభుత్వ రహస్యాల చట్టం కిందకు వస్తుందన్నారు. దీంతో డీల్ కు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వెల్లడించలేమంటూ కాంగ్రెస్ పై  నిర్మలా సీతారామన్ ఎదురుదాడి చేశారు.