- సీసీ రోడ్డు పనుల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్
- పనులు సరిగ్గా చేయడం లేదనడంతో గొడవ
- ఫిరోజ్పైకి దూసుకుకెళ్లిన ఎమ్మెల్యే మాజిద్‌హుస్సేన్, ఆయన అనుచరులు
- కర్రలు, రాళ్లతో దాడి.. పలువురికి స్వల్ప గాయాలు
- లాఠీచార్జ్చేసిన పోలీసులు.. ఇరువర్గాలపై కేసులు
మెహిదీపట్నం, వెలుగు: ఆసిఫ్‌నగర్‌లో సోమవారం ( అక్టోబర్ 8, 2024 ) ఎంఐఎం, కాంగ్రెస్ నేతల మధ్య మొదలైన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీసీ రోడ్డు నిర్మాణంలో తలెత్తిన వివాదంలో రెండు పార్టీల నేతల కొట్టుకున్నారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని విజయనగర్ కాలనీ, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురు గల్లీలోని ఫిరోజ్ గాంధీనగర్ లో రూ.17 లక్షలతో గత శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ ఉమర్ రోడ్డును తవ్వించాడు. రెండు వైపులా కాకుండా ఒక వైపు నుంచి పనులు చేయాలని స్థానికులు హూమాయున్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.అయితే స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఉస్మాన్ ఇల్లు కూడా ఇదే రోడ్డులో ఉంది. ఇటీవల రోడ్డు పనుల కోసం పోసిన కంకరపై జారిపడి ఉస్మాన్ గాయపడ్డాడు.
ఆయనను పరామర్శించేందుకు నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేత, కంటెస్టెడ్ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ సోమవారం సాయంత్రం అక్కడికి వచ్చారు. రోడ్డు పనులను సక్రమంగా చేయడం లేదని ఫిరోజ్ ఖాన్ అనడంతో స్థానిక ఎంఐఎం లీడర్లు ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కు ఫోన్‌చేసి చెప్పారు. వెంటనే ఆయన తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు ఫిరోజ్ ఖాన్ పైకి దూసుకువెళ్లారు. ఫిరోజ్ ఖాన్ వర్గీయులు కూడా ప్రతి దాడికి దిగారు.
Also Read :- హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్..లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ఈ క్రమంలో కర్రలతో, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆసిఫ్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో ఇరువర్గాలపై లాఠీచార్జ్చేశారు. అయినప్పటికీ ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. వందల మంది గుమిగూడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికులు ఇండ్లకు తలుపులు పెట్టుకొని లోపల ఉండగా, రోడ్డుపై పని కోసం వచ్చిన వారు ఇండ్లకు పరుగులు పెట్టారు. వెంటనే సౌత్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో బలగాలను రంగంలోకి దించారు. ఆసిఫ్ నగర్ ఏసీపీ విజయ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని రెండు వర్గాలను శాంతింపజేశారు. ఎంఐఎం కార్పొరేటర్లు హుమాయున్ నగర్ పీఎస్‌లో ఫిరోజ్ ఖాన్ పై ఫిర్యాదు చేయగా, ఫిరోజ్ ఖాన్ అనుచరులు కూడా ఫిర్యాదు చేసినట్లు డీసీపీ చంద్రమోహన్ తెలిపారు.