బాసరలో జైన శాసన దేవత చక్రేశ్వరి శిల్పం

  • బాసరలో జైన శాసన దేవత చక్రేశ్వరి శిల్పం
  • 9, 10వ శతాబ్దాలకు చెందినదిగా గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: నిర్మల్ జిల్లా బాసరలోని కుక్కలగుడిలో జైన శాసన దేవత చక్రేశ్వరి శిల్పం లభ్యమైంది. అతి పురాతనమైన ఈ గుడిలో జైన శాసన దేవత శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ గుర్తించారు. సరస్వతీ దేవీ కొలువైన బాసరలో అష్ట తీర్థాలున్నాయి. వాటిలో ఇంద్రతీర్థంగా పిలిచే కుక్కుటేశ్వరాలయానికి కుక్కలగుడి అనే పేరుంది. చతుర్భుజిగా ఉన్న ఈ చక్రేశ్వరి చేతుల్లో శంఖం, అంకుశాలు, ఫలం ఉన్నాయి.

తలపై కిరీటం, తల వెనక ప్రభావళి, చెవులకు పెద్ద కుండలాలు, గొంతు మీద జైన తీర్థంకరులకు కనిపించే త్రివళితాలు, మెడలో కంఠిక, హారం, కాళ్లకు కడియాలు, చేతులకు కంకణాలతో విగ్రహం ఉంది. ఈ శిల్పం 9, 10వ శతాబ్దాలకు, రాష్ట్రకూట శైలికి చెందినదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్, శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. జైన ధర్మంలోని దిగంబర, శ్వేతాంబర శాఖాభేదాలు రెండింటిలోనూ చక్రేశ్వరిని పూజిస్తుంటారని వెల్లడించారు.