బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్(బి) గ్రామ శివారులోని కుంటగట్టుపై ఇటీవల కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. స్థానికులిచ్చిన సమాచారం మేరకు తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు బల్గం రామ్మోహన్, డా.మంత్రి శ్రీనివాస్ బుధవారం అక్కడికి వెళ్లి పరిశీలించారు.
ఇందులో గణపతి, హనుమంతుడి ఉల్చణ విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే వీరుగల్లు శాసనం కూడా లభించిందని, అది రాష్ట్ర కూటుల కాలమైన 9వ శతాబ్దపు చివరిదిగా భావిస్తున్నట్టు చెప్పారు. శాసనం బాగా చెదిరిపోగా.. 5 పంక్తుల తెలుగన్నడ లిపి, కన్నడ భాషలో కర్కమ అనే వీరుడి పేరును వాటిలో ప్రస్తావించినట్లు గుర్తించారు.