కాకతీయ కాలం నాటి శిల్పసంపద కోసం ప్రాజెక్టు పునరుజ్జీవ

కాకతీయ కాలం నాటి శిల్పసంపద కోసం ప్రాజెక్టు పునరుజ్జీవ

ములుగు జిల్లా రామప్ప ఆలయంలోని కాకతీయుల కాలం నాటి శిల్పాలు శిథిలమవడంతో తిరిగి పూర్వ రూపం తీసుకురావడం సాధ్యం కాకపోయినా ప్రాజెక్ట్​ పునరుజ్జీవ పేరుతో 150 శిథిల శిల్పాలను అచ్చుగుద్దినట్లు రూపొందిస్తున్నారు. విశ్రాంత పురావస్తు అధికారి ఈమని శివనాగిరెడ్డి, చిత్రకారుడు ఏలూరి శేషబ్రహ్మం. టార్చ్​(టీమ్​ ఆఫ్​ రీసెర్చ్​ ఆన్​ కల్చర్​ అండ్​ హెరిటేజ్​) సంస్థ కార్యదర్శి అరవింద్​ ఆర్య, యాదాద్రి ఆలయానికి డిప్యూటీ స్థపతిగా పనిచేసిన రఘువీర్​ లాంటి పురావస్తు ఔత్సాహికులు 15 మంది బృందంగా ఏర్పడి ఈ ప్రాజెక్టు పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టారు. 

ఈ ప్రాజెక్టులో భాగంగా కాకతీయుల కాలంలో చెక్కిన 150 అద్భుతమైన శిల్పాలను ఎంపిక చేశారు. వాటి కొలతలు తీసుకుని కృత్రిమ మేధ సాంకేతికత సహకారంతో కంప్యూటర్​లో పూర్తి రూపాన్ని సృష్టించిన అనంతరం చిత్రకారుడితో చిత్రాలు గీయించి చివరగా పాత శిల్పాన్ని అచ్చుగుద్దినట్టు సిమెంట్​తో తయారు చేస్తారు. 

    ఓరుగల్లు కోటలోని మూల విగ్రహమైన సర్వతోభద్ర శివలింగంలోని నాలుగు ముఖాలు, కోటలోని కీర్తి ముఖం, రామప్ప ఆలయంలోని ఆరు కాళ్లనే నాలుగు కాళ్లుగా భ్రమింపజేసే ముగ్గురు నాట్యగత్తెల శిల్పం, సాలభంజికలు, వేటగత్తెతోపాటు ఉపాలయంలో విరిగిన స్తంభం వంటివి ఎన్నో అపురూపమైన కళాఖండాలను ఈ ప్రాజెక్టులో భాగంగా పున: సృష్టిస్తున్నారు. 

    ఓరుగల్లు ప్రాంత శిల్పాలే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఏపీ, ఛత్తీస్​గఢ్​ల్లో కాకతీయులు కట్టిన ఆలయాల్లో శిథిలమైన అపురూప శిల్పాల ఫొటోలు, కొలతలు తీసుకున్నారు. ఇప్పటివరకు 30 చిత్రాలు పూర్తయ్యాయి.