హనుమకొండ, వెలుగు: కేయూ దూరవిద్యా కేంద్రం మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రావు క్లోజ్ చేయించి తాళం వేసిన ఎస్డీఎల్సీఈ ఎంట్రన్స్ గేట్లు ఎట్టకేలకు తెరచుకున్నాయి. వీసీ రమేశ్ అండదండలతో గేట్లకు తాళం వేశారనే ఆరోపణ ఉండగా.. మంగళవారం ఆయన పదవీ కాలం ముగిసిన అనంతరం దూరవిద్యా ఐక్య ఉద్యోగుల సంఘం చైర్మన్ డాక్టర్ సంగని మల్లేశ్వర్ ఆధ్వర్యంలో గొలుసులు కట్ చేసి, తాళం తీశారు.
ఈ సందర్భంగా సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ గత ఎస్డీఎల్సీఈ డైరెక్టర్ ఇక్కడున్న రెండు గేట్లు మూసేశారని తెలిపారు. గేట్లు మూసేయడం వల్ల దాదాపు 50 మంది ఉద్యోగుల బైకులు రోడ్డుమీద నిలపాల్సి వచ్చేదని, వాహనాలకు భద్రత లేక పోలీసు చాలాన్స్ కట్టలేక ఇబ్బందులు అయ్యేవని చెప్పారు. అయినా వీసీ రమేశ్ అండదండలతో ఉద్యోగులపై వివక్ష చూపారని మండిపడ్డారు.
ఉదయం, సాయంత్రం గేట్లు తీసి ఉద్యోగులకు సౌకర్యం కల్పించాలని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొ.వల్లూరి రామచంద్రంకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పూలే ఆశయ సాధన సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొట్టే భాస్కర్, ప్రధాన కార్యదర్శి పోలెపాక ప్రతాప్, ఉద్యోగుల సంఘం నాయకులు బండి వెంకటేశ్వర్లు, బాల్నే నాగేశ్వరరావు, ఆకునూరి సుదయ్య, గౌస్ పాషా, డాక్టర్ నల్ల వేమన, డాక్టర్ తాటికాయల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.