సముద్రమే మానవులకు ఆదర్శం.. ఎలాగంటే

సముద్రానికి మనిషి జీవితానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. సముద్రం హోరు చాలా దూరానికి కూడా వినిపిస్తుంది. దగ్గరకు పొయ్యేకొద్దీ ఆ శబ్దం పెరుగుతుంది. అలాగే సముద్రం దూరానికి నిండుగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. బాగా దగ్గరకెళ్లి చూస్తే అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి. చూడాలంటే భయం వేస్తుంది కూడా. మనిషి జీవితం కూడా అంతే. ఒక్కసారి ఒక్కోలా అనిపిస్తుంది. సంతోషం... బాధ.. విజయం సాధించినప్పుడు... ఓడిపోయినప్పుడు... ఒక్కో విధంగా ఉంటుంది. అందుకే, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి? ఎలా బతకాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలాంటి ఆలోచనలు చేయాలి? అందుకు ఎలాంటి గుణాలు అవసరం?.... ఇవన్నీ సముద్రం నుంచి నేర్చుకోవచ్చు.

ఆధ్యాత్మిక గ్రంథాల్లో సముద్రానికి ఆ ప్రత్యేకస్థానం ఉంది. పరిపూర్ణ వ్యక్తిత్వానికి సముద్రాన్ని ప్రతీకగా చెప్తారు. విష్ణువు పాలసముద్రంపైనే ఉంటాడని.. ఆ సముద్రాన్ని చిలికినప్పుడు చంద్రుడు, అమృతం, లక్ష్మీదేవి, విషం... పుట్టాయని పురాణాల్లో కనిపిస్తుంది. సప్తసముద్రాల గురించిన ప్రస్తావన కూడా ఉంది. బుద్ధుడు తన శిష్యుడైన మౌద్గల్యాయనుడితో మనిషి ప్రవర్తనను సముద్రంతో పోల్చి వివరించాడు. సముద్రానికి ఉన్న గుణాలు మనిషికి ఉండాలన్నాడు.

వదిలేయాలి: సముద్రం ఆటుపోటులతో ఉంటుంది. కానీ, అలాగని తనలో ఎలాంటి చెత్తను ఉంచుకోదు. కుళ్లిపోయిన పదార్థాలు, పనికిరాని వస్తువులు, శవాలు.. ఏవైనా సరే తనలో ఉండనివ్వదు.. అలలతో బయటకు నెట్టేస్తుంది. మనుషులు కూడా ఏది మంచి?, ఏది చెడు? అని తెలుసుకోవాలి. కోర్కెలు, చెడు ఆలోచనలు, ఇతరులకు హాని చేసేవి, తననుతాను బాధ పెట్టుకునే పనులు చేయకూడదు. ఎప్పటికప్పుడు చెడు స్వభావాన్ని వదిలేస్తూ సముద్రంలా బతకాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలరు. 

నేర్చుకుంటూనే : సముద్రం ఒడ్డున లోతుగా ఉండదు. లోపలకు పోయే కొద్దీ లోతు పెరుగుతూ ఉంటుంది. అలలు కూడా కొంత దూరమే ఉంటాయి. ఒడ్డునే ఎక్కువ ఎత్తున లేస్తుంటాయి. దూరం పోయే కొద్దీ అవీ ఉండవు. మనిషి కూడా పుట్టుకతో ఏమీ నేర్చుకోకపోవచ్చు. కానీ పెరిగే కొద్దీ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ పోవాల్సిందే. ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాల్సిందే. అలా
నేర్చుకున్న వాళ్లే ముందుకెళ్తారు. నాకు అన్ని తెలుసు అనుకున్నా, నేర్చుకోవడానికి ఇష్టపడకపోయినా సముద్రంలో అలల్లా కొంతదూరం మాత్రమే వెళ్లగలరు. అందుకే సముద్రం ఎలా అయితే వెళ్లే కొద్దీ లోతు పెరుగుతుందో మనిషి కూడా వయసు పెరిగే కొద్దీ జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి.

సొంత ఆలోచన: సముద్రంలో నదులు కలుస్తాయి. ఎంతో మంది స్నానాలు చేస్తుంటారు. వర్గాలు కురిసినప్పుడు ఆ నీళ్లూ వచ్చి చేరుతాయి. తుపానులు వచ్చినప్పుడు అల్లకల్లోలం అవుతుంది. అయినా తన సహజ స్వభావాన్ని మాత్రం కోల్పోదు. సముద్రం నీళ్లు ఉప్పగానే ఉంటాయి. లవణాలూ ఉంటాయి. మనిషి కూడా అలాగే జీవించాలి. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత మందితో మాట్లాడినా, ఎన్ని అడ్డంకులు. ఎదురైనా.. సొంతదైన ఆలోచన ఉండాలి. తన గురించి తాను నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండాలి. ఎన్ని ప్రభావాలు తనపై పడుతున్నా తనకేది మంచిదనిపిస్తే, ఏది సంతోషం అనిపిస్తే.. అదే చేయగలిగే ధైర్యం ఉండాలి. అందుకే సముద్రంలో సొంతదైన వ్యక్తిత్వం కావాలి.

స్థిరంగా : సముద్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఒడ్డు దాటి ముందుకు రాదు. నదులు, తుపానుల వల్ల వచ్చే ఎంత నీటినైనా తనలో చేర్చుకుంటుంది. లోపల శిలలు, అగ్నిపర్వతాలు.. లాంటివి ఎన్ని ఉన్నా పైకిమాత్రం స్థిరంగా కనిపిస్తుంది. మనిషి కూడా అలాంటి వ్యక్తిత్వాన్నే అలవర్చుకోవాలి. చిన్నచిన్న బాధలకు కుంగిపోకూడదు. సంతోషాలకు పొంగిపోకూడదు. ఎదిగే కొద్దీ క్రమంగా ఇలాంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే చిన్న విజయాలతో ఆగిపోకుండా పైకి ఎదగొచ్చు. అలాగే ఎంత సంపాదించినా, ఎంత స్థాయికి ఎదిగినా గర్వానికి లోనుకాకుండా బతకొచ్చు.

అన్నింటికి అతీతంగా : సముద్రంలో ఎన్ని చేరినా, కాల్వలు, నదులు కలిసినా అలాగే ఉంటుంది. తన ప్రత్యేకతను ఎప్పుడూ కోల్పోదు. మనిషి చుట్టూ అనేక ప్రలోభాలకు గురిచేసే వస్తువులు, వ్యక్తులు, పదార్థాలు.. ఎన్నో ఉంటాయి. వేటికీ బానిస కాకూడదు. తనవాళ్లు, పరాయి వాళ్లు అనే భావం పనికిరాదు. తనలోని చెడు గుణాల్ని వదిలించుకున్నట్లే, బయటవాటిని కూడా దూరంగా పెట్టాలి. సొంతదైన మంచితనంతో బతకాలి.

గర్వం వద్దు : సముద్రంలో కేవలం నీళ్లు మాత్రమే కాదు, ఎన్నో రకాల నిధులుంటాయి. రత్నాలు, పగడాలు, శంఖాలు.. లాంటి అపురూపమైన నిక్షేపాలు ఉంటాయి. వాటి విలువ చాలా ఉండొచ్చు. కానీ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మనిషి కూడా ఎప్పటికప్పుడు గొప్ప స్థాయికి వెళ్లేందుకు కష్టపడాలి. కానీ ఎంత స్థాయికి ఎదిగినా గర్వపడకూడదు. ఎన్ని విలువైన ఆస్తులు, పదవులు, జ్ఞానాన్ని పోగేసుకున్నా, మామూలుగానే ప్రవర్తించాలి. తనను తాను సాధారణ వ్యక్తిగానే చూసుకోవాలి. అలాగే ఇతురులు గుర్తించేలా జీవించాలి. గర్వం వస్తే అదే మనిషిని నాశనం చేస్తుంది.

అందరూ సమానమే : సముద్రంలో చిన్నచిన్న చేప పిల్లలనుంచి పెద్దపెద్ద తిమింగలాల వరకు ఉంటాయి. మనిషిని కూడా తినేసే పెద్దపెద్ద జీవరాశులుంటాయి. సముద్రం అన్నింటికి తనలో స్థానం కల్పిస్తుంది. ఒకేలా తనలో దాచుకుంటుంది. అలాగే సమాజంలో అనేక రకాల మనస్తత్వం ఉన్నవాళ్లు ఉంటారు, డబ్బు, పదవి, ఉద్యోగం.. లాంటి వాటివల్ల వివిధ స్థాయిల్లో బతుకుతుంటారు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులవల్ల భేదాలు ఉండొచ్చు. అయితే ఏ స్థాయిలో ఉన్నా, ఏ. స్థితిలో ఉన్నా సముద్రంలా అందరినీ ఒకేలా..
చూసే స్వభావం మనిషికి ఉండాలి.

మంచి గుణాలు : సముద్రం చెరువులా చిన్నది కాదు. అలాగే నదిలా ఎక్కువదూరం ప్రవహించదు... ఉన్న స్థలంలో ఉన్న విధంగానే ఉంటుంది. అయినా తన సహజ స్వభావాన్ని కోల్పోదు. మనిషి కూడా ఎక్కడకు వెళ్లినా, ఉన్నత స్థాయికి ఎదిగినా తనలోని మంచి గుణాలను వదిలేయకూడదు. ధనం, పదవి, బలం, బలగాలను చూసుకొని మంచితనాన్ని వదిలేయకూడదు. చెడు మార్గాల జోలికి వెళ్లకూడదు. సహజమైన మంచి స్వభావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయకూడదు.