నాగార్జునసాగర్​లో సీ ప్లేన్ సర్వీసులు

  • నాగార్జునసాగర్​లో సీ ప్లేన్ సర్వీసులు
  • శ్రీశైలం, విజయవాడకు రాకపోకలు 
  • వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం 
  • ఉడాన్ స్కీమ్ కింద వాటర్ ఏరోడ్రోమ్​గా అభివృద్ధి 
  • మొదటి విడత కింద  రూ.20 కోట్లు విడుదల 

నల్గొండ, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య త్వరలో సీ ప్లేన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. నాగార్జునసాగర్ కేంద్రంగా సీ ప్లేన్ సర్వీసులు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉడాన్ స్కీమ్ కింద నాగార్జునసాగర్ రిజర్వాయర్ ను వాటర్ ఏరోడ్రోమ్ గా అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం మొదటి విడత కింద రూ.20 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు.. కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్‌‌ వీకే సింగ్‌‌ ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశంలో ఉడాన్ స్కీమ్ కింద ఎంపిక చేసిన రాష్ట్రాల్లో కేంద్రం సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సీ ప్లేన్ సేవలు ప్రారంభించింది.  

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా 

కేంద్రం నిర్ణయంతో నాగార్జునసాగర్ అంతర్జాతీ య పర్యాటక కేంద్రంగా మారనుంది. ఈ రిజర్వాయర్​ను వాటర్ ఏరోడ్రోమ్​గా డెవలప్​ చేస్తే నాగార్జునసాగర్ నుంచి ఏపీలోని శ్రీశైలం, విజయవాడ మధ్య సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. 400 టీఎంసీల భారీ నిల్వ సామర్థ్యమున్న నాగార్జునసాగర్ రిజర్వాయర్.. ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇదొక బౌద్ధ క్షేత్రం కూడా. ఇక్కడ ఇటీ వల బుద్ధవనం కూడా ప్రారంభించారు. దీంతో దేశ నలుమూలల నుంచి టూరిస్టులు వస్తున్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసి విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. దీని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అధికారులు అంటున్నారు. నాగార్జునసాగర్ లో సీ ప్లేన్ సేవలు మొదలైతే దేశంలోని టూరిస్ట్ ప్లేసులకు వెళ్లేందుకు ఈజీ అవుతుందని చెబుతున్నారు. 

మూడేండ్ల కింద ప్లాన్

నాగార్జునసాగర్, శ్రీశైలం, విశాఖపట్నం, హుస్సే న్​సాగర్​ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ సీ ప్లేన్​నడపాలని మూడేండ్ల కిందనే కేంద్రం సర్వే నిర్వహించింది. సాగర్​లో ప్లేన్ లు ఎక్కడ దిగాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్లేన్ లు నడపాలి? అనే దానిపై స్టడీ చేసింది. కెప్టెన్ ఇల్షాద్ అహ్మద్​నేతృత్వంలోని టీమ్ డీపీఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపింది. సాగర్ రిజర్వాయర్ నుంచి ప్లేన్ లు నడపొచ్చని అందులో పేర్కొంది. తెలంగాణ, ఏపీ మధ్య 9,12,2‌‌0 సీట్ల సామర్థ్యం కలిగిన సీ ప్లేన్ లు నడిపేందుకు అనుకూలంగా ఉందని గుర్తించింది. నాగార్జునసాగర్ నుంచి -శ్రీశైలం, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలకు సీ ప్లేన్ లు నడిపేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతానికి శ్రీశైలం, విజయవాడకు సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఆ తర్వాత విశాఖపట్నం వరకు విస్తరించే అవకాశం ఉంది. 

మరింత అభివృద్ధి అయితది..  

నాగార్జునసాగర్ ను వాటర్​ ఏరోడ్రోమ్​గా డెవలప్ చేసేందుకు మూడేండ్లుగా కృషి చేశాను. సాగర్ ను వాటర్​ ఏరోడ్రోమ్​గా అభివృద్ధి చేసేందుకు రూ.20 కోట్లు కేటాయించినట్లు కేంద్రం ఇటీవల తెలిపింది. దీంతో సాగర్ మరింత అభివృద్ధి చెందుతుంది.  
‌‌‌‌- ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ