శ్రీశైలం, వెలుగు: శ్రీశైలానికి సీ ప్లేన్సర్వీసులు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. స్పైస్ జెట్ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లోకి సీ ప్లేన్ నడిపించేందుకు ఏపీ ప్రభుత్వం కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా విజయవాడ నుంచి తొలి సీ ప్లేన్ శనివారం బయలుదేరి మధ్యాహ్నానికి శ్రీశైలం చేరుకుంటుంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న పున్నమి ఘాట్ దగ్గర సీ ప్లేన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 10.45 గంటలకు ప్రారంభించనున్నారు.
అనంతరం 12 గంటలకు అక్కడి నుంచి సీ ప్లేన్‌లో 12.45 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటారు. ఈ మేరకు నల్లగొండ పరిధిలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేలా ఏపీ ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కిలో మీటరున్నర దూరం బోటులో ట్రావెల్ చేస్తే పాతాళగంగకు చేరుకోవచ్చు. అక్కడ ప్రయాణికులు బోట్ దిగి రోప్ వే ద్వారా శ్రీశైలానికి చేరుకోవాలి. ప్రయాణికులు సీ ప్లేన్ ఎక్కడానికి, దిగడానికి వీలుగా శ్రీశైలంలో వాటర్ వే ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారీ జెట్టీలను తయారుచేశారు. ప్రయాణికులు బోటులో ఈ జెట్టీ వద్దకు వచ్చి సీ ప్లేన్
ఎక్కాల్సి ఉంటుంది.
45 నిమిషాల్లోనే బెజవాడ నుంచి శ్రీశైలానికి
ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో సీ ప్లేన్ నిర్వహణ చేపడ్తున్నారు. స్పైస్ జెట్ సంస్థ ఈ విమాన సర్వీసులను నడపనున్నది. ప్రస్తుతం రెండు సీ ప్లేన్లను అందుబాటులో ఉంచారు. అందులో ఒకటి 14 సీట్ల కెపాసిటీది కాగా.. మరొకటి 19 సీట్లతో అందుబాటులో ఉంది. శ్రీశైలం–విజయవాడకు రోడ్డు మార్గాన 270 కిలోమీటర్ల దూరం ఉండగా.. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో రావాలంటే ఘాట్ రోడ్డు కావడంతో దాదాపు 8 గంటల సమయం పడుతున్నది. కానీ ఈ సీ ప్లేన్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో త్వరలో ఖర్చు, నిర్వహణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని, సర్వీసులను ఎప్పటి నుంచి ప్రారంభించాలి? రోజూ ఎన్ని సర్వీసులు నడపాలి? టికెట్ ధర ఎంత నిర్ణయించాలి? అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు ఏపీ టూరిజం ఆఫీసర్లు చెప్తున్నారు. కాగా.. ఈ రూట్ సక్సెస్ అయితే హైదరాబాద్–శ్రీశైలం, విశాఖపట్నం–శ్రీశైలం, బెంగళూరు–శ్రీశైలం సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిసింది.