కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జూడా రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను సీల్దా కోర్టు దోషిగా నిర్ధారించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా సంజయ్ రాయ్ న్యాయస్థానం దోషిగా తేల్చింది. 2025, జనవరి 20వ తేదీన దోషి సంజయ్‌కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. కేసులోని సెక్షన్లను బట్టి దోషికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2024, ఆగస్ట్ 9వ తేదీన కోల్ కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడింది అదే ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్‌గా పని చేసే సంజయ్ రాయ్‌గా పోలీసులు గుర్తించారు. 2025, ఆగస్ట్ 10న నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సీబీఐను రంగంలోకి దించింది. ఈ కేసును సీబీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టింది. మొత్తం 120 మంది సాక్ష్యులను విచారించిన సీబీఐ.. బలమైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించింది. సీబీఐ సాక్ష్యాల ఆధారంగా సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చింది.