హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్ల నియామకం కోసం కసరత్తు కొనసాగుతోంది. వీసీల నియామాకం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు దూకుడు పెంచాయి. ఇందులో భాగంగా.. ఇవాళ (అక్టోబర్ 3), రేపు (అక్టోబర్ 4) రెండు రోజుల పాటు సెర్చ్ కమిటీలు కీలక భేటీలు నిర్వహించనున్నాయి.
ఇవాళ పాలమూరు, తెలుగు యూనివర్సిటీ, ఓయూలో సమావేశం కానున్న సెర్చ్ కమిటీలు.. రేపు కాకతీయ, జేఎన్టీయూ, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీలలో సమావేశాలు నిర్వహించి వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నాయి. సెర్చ్ కమిటీల నివేదిక అనంతరం ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ వర్శిటీలకు వీసీలను నియమించనుంది.
Also Read :- రూ.2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్
కాగా, రాష్ట్రంలోని 10 ప్రభుత్వ యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీసీల నియామకం కోసం ప్రభుత్వం సెర్చ్ కమిటీలని ఏర్పాటు చేసింది. పది యూనివర్సిటీల వీసీ పోస్టుల కోసం మొత్తం 1382 దరఖాస్తులు చేసుకున్నారు. సెర్చ్ కమిటీలు వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి.
సెర్చ్ కమిటీల సిఫారసుల మేరకు ప్రభుత్వం వర్శిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించనుంది. ఎలాంటి అవకతవకలు జరగకుండా.. సామాజిక సమీకరణాలు, క్లీన్ బయోడేటా ఉన్నవారినే పరిగణనలోకి తీసుకొని వీసీలను నియమించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. వర్సిటీలను అభివృద్ధి చేసే వారికే వీసీ పదవు ఇవ్వాలని విద్యార్థులు, అధ్యాపకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సెర్చ్ కమిటీల కసరత్తు అనంతరం ప్రభుత్వం త్వరలోనే వర్శిటీలకు వీసీలను నియమించనుంది.