నందిపేట మండలంలో పులి జాడ కోసం గాలింపు

నందిపేట మండలంలో పులి జాడ కోసం గాలింపు

నందిపేట, వెలుగు : నందిపేట మండలం కొండూర్​శివారులో మంగళవారం సాయంత్రం మేకల మందపై చిరుతపులి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై బుధవారం రేంజ్​అటవీశాఖ అధికారి సుధాకర్, ఎస్ఐ చిరంజీవి గొర్రెల కాపరి పోతన్నను విచారణ చేసి దాడి చేసిన ప్రాంతంలో పులి జాడ కోసం గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. అటవీశాఖ అధికారి సుధాకర్​ మాట్లాడుతూ గొర్రెపై దాడి చేసిన ఆనవాలు మాత్రం ఏదో ఒక అడవి జంతువు ఈ ప్రాంతంలో సంచరిస్తుందని అది పులి అవునో, కాదో చెప్పలేమన్నారు.

దాన్ని గుర్తించేందుకు అడవికి, పంటపొలాలకు మధ్య ఉన్న కొన్ని దారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అడవిలోకి గ్రామస్తులు వెళ్లొద్దని,  పొలాలకు వెళ్లేవారు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు.  కొందరు రైతులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పులిబారి నుంచి రక్షించుకునేందుకంటూ పొలాల చుట్టూ కరెంటు తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలా చేయడం చట్టరీత్యా నేరమన్నారు.  ఇటువంటి చర్యలతో జంతువులు, మనుషులు మృత్యువాత పడితే నాన్​బెయిలబుల్​ కేసులు నమోదు చేస్తామన్నారు.