నేను గొప్ప బ్యాటర్‌ని.. నా రికార్డుల కోసం గూగుల్‌లో వెతుక్కో..: జస్ప్రీత్ బుమ్రా

నేను గొప్ప బ్యాటర్‌ని.. నా రికార్డుల కోసం గూగుల్‌లో వెతుక్కో..: జస్ప్రీత్ బుమ్రా

బుమ్రా బౌలర్ కదా..! బ్యాటర్ అని చెప్పుకోవడమేంటి..? అని అనుకుంటున్నారా. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. తనకు బ్యాటింగ్ రాదనేలా మాట్లాడిన ఓ పాత్రికేయుడికి బుద్ధిచెప్పడానికే భారత పేసర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. అగ్రశ్రేణి బ్యాటర్లకు సైతం సాధ్యం కానీ ఓ రికార్డు తాను నెలకొల్పానని.. సందేహాలుంటే గూగుల్‌లో వెతుక్కోవాలని బుమ్రా సూచించారు.

బౌలరైనా.. ఆఖరి స్థానంలో క్రీజులోకి వచ్సినా ఎంతో కొంత బ్యాటింగ్ చేయడం తెలుసుంటది. ఈ విషయంలో బుమ్రా ఇంకాస్త గొప్ప బ్యాటరే. జట్టుకు తన వంతు పరుగులు చేయడంలో సహాయపడగల సమర్థుడు. ఈ విషయాన్నీ మరిచిన మీడియా మిత్రుడు అతన్ని చులకన చేసేలా మాట్లాడారు. అందుకు భారత పేసర్ తనదైన శైలిలో కౌంటర్లు విసిరారు. వారి సంభాషణ ఎలా సాగిందో ఇప్ప్పుడు చూద్దాం..

విలేఖరి: "హాయ్ బుమ్రా. బ్యాటింగ్‌పై మీ అంచనా ఏమిటి..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్ప గల సరైన వ్యక్తి మీరు కానప్పటికీ, గబ్బాలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే జట్టు పరిస్థితి గురించి మీరు ఏమనుకుంటున్నారు?" అని ప్రశ్నించారు. 

బుమ్రా: "ఇది ఆసక్తికరమైన ప్రశ్న. ఇక్కడ మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న వేయడానికి ముందు మీరు గూగుల్‌ని ఉపయోగించాల్సింది. ఒక టెస్ట్ ఓవర్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ ఎవరనేది చెక్ చేయాల్సింది.." అని భారత పేసర్ బదులిచ్చారు. 

ALSO READ | భారత క్రికెటర్లపై ఎందుకింత ద్వేషం..? కోతుల్లా కనిపిస్తున్నారా..?

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 51 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్‌లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంకెన్ని పరుగులు చేయొచ్చు అన్న ఉద్దేశ్యంతో సదరు జర్నలిస్ట్ ఇలాంటి ప్రశ్న వేశారు. కాకపోతే, బుమ్రాను సరైన వ్యక్తి కాదని అనడం సరైనది కాదనేది భారత పేసర్ అభిప్రాయం. బుమ్రా నోటి నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని ఆశించని మీడియా మిత్రులు నవ్వుతో తమ తప్పును సరిదిద్దుకున్నారు.

ఈ భారత పేసర్ 2022లో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన ఓ మ్యాచ్ లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్ లో ఏకంగా 34 పరుగులు రాబట్టాడు.