
- గోదావరి బెల్టులో ఓఎన్ సీ అన్వేషణ
- ఇప్పటికే ఖమ్మం, భద్రాచలంలో పూర్తి
- తాజాగా భూపాలపల్లి జిల్లాలో పనులు
- జూన్ 10 నాటికి కేంద్రానికి నివేదిక
గోదావరి బెల్టులో చమురు నిక్షేపాల కోసం అన్వేషణ ఊపందుకుంది. రోజుకు మూడు కిలోమీటర్ల మేర నదీ తీరం వెంబడి ఓఎన్ జీసీ సంస్థ సర్వే చేస్తోంది.ఇప్పటికే ఖమ్మం, భద్రాచలంలో సర్వే పూర్తయింది. ప్రస్తుతం భూపాలపల్లిలో అన్వేషణ జరుగుతోంది. జూన్ 10 నాటికి సర్వే పూర్తి చేసి కేంద్రానికి ప్రాథమిక నివేదికివ్వాలని అధికారులు అంటున్నారు. నిక్షేపాలున్నయో లేదో త్వరలోనే తెలుస్తుందని చెబుతున్నారు .
ఇప్పుడు 2డీ సర్వే
శాటిలైట్ల సాయంతో సర్వే చేస్తున్నామని సంస్థ పీఆర్వో సత్తిబాబు తెలిపారు. రోజువారి సర్వేకు సంబంధించి శాటిలైట్ వివరాల మ్యాప్ వస్తుందని,దాంట్లో చూపిన ప్రాంతానికెళ్లి పనులు మొదలుపెడతామని చెప్పారు. ‘భూమి లోపల 70 మీటర్ల లోతు వరకు గుంత తవ్వి పరికరాలు అమర్చుతాం. అక్కడినుంచి చుట్టూ 18 కి.మీ. దూరం తీగలు చాపి 90 డిగ్రీల కోణంలో శబ్ద తరంగాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. వీటిని కంప్యూటర్ సాయంతో భూగర్భ శాస్త్రవేత్తలు (జియాలజిస్టులు) పరిశీలించి నివేదిక రూపొందిస్తారు.
రోజుకు 2 నుంచి 3 కి.మీ. పొడవు, 20, 25 కి.మీ.వెడల్పు సర్వే చేస్తున్నాం’ అన్నారు. చమురు నిక్షేపాలున్నాయని తేలిన ప్రాంతాల్లో 3డీ సర్వే చేస్తామని చెప్పారు. 3 నెలల్లో కొత్తగూడెం, భద్రాచలం,చిండ్రగుంట, పాల్వంచ, పెనుగొలుల్లో 2డీ సర్వే చేశామన్నారు . ఈ నెలాఖరు వరకు భూపాలపల్లిలో చేసి తర్వాత మంచిర్యాల, పూర్వ వరంగల్ జిల్లాల పరిధిలో మొదలుపెడతామని చెప్పారు. సర్వే ఫలితాలను కేంద్రం 2021లో ప్రకటిస్తుందన్నారు.
1990లో ఆగిన సర్వే
ఆయిల్ నిక్షేపాల కోసం పూర్వ కరీంనగర్ జిల్లాలోని మహాముత్తారం, కాటారం మండలాల్లో 1990లోనే ఆల్ఫా కంపెనీ సర్వే చేసిందని స్థానికులు చెప్పారు.కానీ అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేదని,దీంతో నెల రోజులు సర్వే చేసిన కంపెనీ తర్వాత అకస్మాత్తుగా పనులు ఆపేసిందన్నారు . 28 ఏళ్లకు ఓఎన్ జీసీ సర్వే ప్రారంభించిందని చెప్పారు.