39 వేల ఎకరాల్లోనే వరి పంట

39 వేల ఎకరాల్లోనే వరి పంట
  •  మరో రెండు వారాల్లో ముగియనున్న సీజన్
  • 1.39 లక్షల ఎకరాల వరికి ఇప్పటికి సాగైంది 39 వేల ఎకరాలే
  • ఇప్పటి వరకు రాష్ట్రంలో 10.27 లక్షల ఎకరాల్లోనే సాగు


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సాగు ఎన్కవడ్డది. ప్రభుత్వం వరి వేయొద్దని ప్రకటించడంతో రైతులు పంటలేసుడు తగ్గించినట్లు కన్పిస్తోంది. నిరుడు ఈ టైమ్​కు సాగైన విస్తీర్ణంలో ఇప్పటికి 15 శాతం మాత్రమే సాగైంది. యాసంగి సీజన్​ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఇంకో 10 రోజులు లేట్​గా పంటలేసినా.. సీజన్​ ముగిసేందుకు 15 రోజులే టైమ్​ ఉంది. ఈ 15 రోజుల్లో మిగతా 85 శాతం సాగు జరిగేట్లు కనిపించట్లేదని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి కేవలం10.27 లక్షల ఎకరాల్లోనే రైతులు పంటలేశారు. నిరుడు కంటే ఈయేడు నెల ముందే సాగు మొదలైనా.. టార్గెట్​లో 20 శాతం కూడా దాటలేదు. సీజన్​లో సాధారణ పంటల సాగు 46.49 లక్షల ఎకరాలు కాగా, నిరుడు యాసంగి ముగిసే నాటికి 68.16 లక్షల ఎకరాల్లో పంటలేశారు. వ్యవసాయశాఖ నిరుడు సాగును టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకోగా ఇప్పటివరకు టార్గెట్‌‌‌‌‌‌‌‌లో కేవలం15 శాతం మాత్రమే వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ విషయం బుధ వారం ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో పేర్కొంది. 

మక్కలు, మినుముల జోరు..
ఈయేడు యాసంగిలో మక్కల సాగు జోరందుకున్నది. యాసంగిలో మక్కల సాధారణ సాగు 4.32 లక్షల ఎకరాలు కాగా నిరుడు ఈ టైమ్‌‌‌‌‌‌‌‌కు 75 వేల ఎకరాలు సాగైంది. కానీ ఈయేడు ఇప్పటికే 1.58 లక్షల ఎకరాలలో రైతులు మక్క వేశారు. నిరుడు కంటే ఈయేడు రెట్టింపు స్థాయిలో మక్కలు సాగయ్యాయి. యాసంగిలో మినుముల సాధారణ విస్తీర్ణం 24 వేల ఎకరాలు కాగా నిరుడు 23 వేల ఎకరాలే వేశారు. ఈయేడు  రెట్టింపుగా ఇప్పటికే 58 వేల ఎకరాల్లో మినుములు వేశారు. మినుములను కొనేందుకు కేంద్రం గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. దీంతో 58,924 ఎకరాల్లో మినుము సాగైంది. ఏకంగా 245 శాతం సాగు కావడం గమనార్హం. 

పల్లి, పప్పుశనగల వైపు..
ఈయేడు పల్లి, పప్పుశనగ పంటల సాగు పెరుగుతోంది. పల్లి సాధారణ సాగు విస్తీర్ణం 3.01 లక్షల ఎకరాలు కాగా,  నిరుడు 1.76 లక్షల ఎకరాలే సాగైంది. ఈ యేడు ఇప్పటికే 2.99 లక్షల(99%) ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది.   పప్పు శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు కాగా, నిరుడు 2.68 లక్షల ఎకరాల్లో సాగైంది. నేడు ఇప్పటికి 3.06 లక్షల (108%) ఎకరాల్లో సాగు చేశారు. 

పల్సెస్‌‌‌‌‌‌‌‌, ఆయిల్‌‌‌‌‌‌‌‌ సీడ్స్‌‌‌‌‌‌‌‌ సాగు పెరగలే..
పెసర సాధారణ సాగు విస్తీర్ణం 21,488 ఎకరాలు కాగా, ఇప్పటికి 10,194(47%) ఎకరాల్లోనే సాగైంది. కాగా పొద్దు తిరుగుడు సాధారణ సాగు విస్తీర్ణం 10,947 ఎకరాలు కాగా16,635 ఎకరాల్లో సాగైంది. విత్తనాల కొరతతో పొద్దు తిరుగుడు సాగు పెంపు సాధ్యం కాలేదు. కుసుమ సాగు సాధారణానికి(7,609 ఎకరాలు) మించి 10,219 ఎకరాల్లో సాగైంది. మిగతా ఆయిల్‌‌‌‌‌‌‌‌ సీడ్స్‌‌‌‌‌‌‌‌ 8148 ఎకరాల్లో సాగైనట్లు  వ్యవసాయ శాఖ తెలిపింది.

వరి 39 వేల ఎకరాల్లోనే.
రాష్ట్రంలో అక్టోబరు నెలాఖరు, నవంబరు ప్రారంభం నుంచే రైతులు నార్లు పోసి వరి సాగుకు సిద్ధమవుతారు. ఈ నెల మొదటి వారం నుంచే సహజంగా నాట్లు జోరందుకోవాలి. కానీ చివరి వారంలోకి వచ్చినా వరి నాట్లు పుంజుకోలేదని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. యాసంగి వడ్లు కొనబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతులు సందిగ్ధంలో ఉన్నారు. కొందరు లేటుగా నార్లు పోయడం, విత్తన కంపెనీలతో ఒప్పందం చేసుకుని నార్లు పోయడం జాప్యం కావడంతో నాట్లు లేటయినట్లు తెలుస్తోంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం31.01 లక్షల ఎకరాలు కాగా, నిరుడు యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈయేడు ఇప్పటి వరకు కేవలం 39,761 ఎకరాల్లో నాట్లు పడినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. నిరుడు యాసంగిలో ఇదే టైమ్ కు 1.31 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డయి.