- గ్రామాల్లో అస్తవ్యస్థంగా పారశుధ్యం
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గంగారం, కొత్తగూడ, బయ్యారం, గార్ల మండలాల్లో రోజు రోజుకు జ్వర బాధితులు పెరుగుతున్నారు. దీంతో మండల కేంద్రాలు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హస్పిటల్స్రోగులతో నిండిపోతున్నాయి. జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే సుమారు 400 మంది రోగులు జ్వరాలతో అడ్మిట్ అయ్యారు.
గ్రామాల్లో పారిశుధ్య లోపం ..
గ్రామాల్లో పారిశుధ్య నిర్వాహణా లోపం కనిపిస్తోంది. పాలక వర్గాలు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదు. దీంతో ఏజెన్సీ పల్లెల్లో పరిశుభ్రత అస్తవ్యస్థంగా మారింది. కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి, కొత్తపల్లి, గాంధీనగర్, ఎదులపల్లి, కర్నెగండి, కొత్తగూడలో , గంగారం మండలంలోని కోమట్లగూడెం, దుబ్బగూడెం, గంగారం, చింతగూడెం, కామారంలో, బయ్యారం మండలంలోని కట్టుగూడెం, వెంకట్రాంపూరంలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. గూడూరు, గార్ల, మండలాల పరిధిలోని వివిధ ఏజెన్సీ గ్రామాల్లోను పారిశుధ్య లోపం వల్ల గిరిజనులు , ఆదివాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల సమీపంలో పెంట కుప్పలు, గ్రామాల్లో వర్షపు నీరు సరిగ్గా వెల్లకపోవడం, మురుగు కాలువల క్లీనింగ్ సక్రమంగా లేకపోవడం వల్ల జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతీ ఇంటిలో ఇద్దరు, ముగ్గురు జ్వరాల బారిన పడుతున్నారు.
హస్పిటల్‌కు క్యూ
మహబూబాబాద్ ప్రభుత్వ హస్పిటల్‌కు జ్వరబాధితులు క్యూ కడుతున్నారు. 600 మంది వరకు హస్పిటల్‌కు రాగా .. 400 మంది వరకు జ్వర బాధితులే ఉంటున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హస్పిటల్ జనరల్ వార్డుల్లో జ్వర బాధితులతో నిండిపోతుంది.
ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం..
ఏజెన్సీ మండలాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట డాక్టర్లను అలర్ట్ చేస్తున్నాం. వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలంతా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామాల్లో పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహించవద్దు. ప్రతీ శుక్రవారం డ్రై డేగా పాటించాలి. జ్వరాల నియంత్రణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం.
కళావతి బాయి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, మహబూబాబాద్ జిల్లా