![యూట్యూబర్ అస్మితకు సెబీ షాక్.. రూ.53 కోట్లను ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేయాలని ఆదేశం](https://static.v6velugu.com/uploads/2025/02/sebi-bans-financial-influencer-asmita-patel-five-others-from-market-impound-illegal-gains-of-more-than-53-crore-rupees_YvwFkXlHOx.jpg)
- కోర్సుల పేరుతో సేకరించిన రూ.53 కోట్లను ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇచ్చి, కోర్సులు నిర్వహించి ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సేకరించిన అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్, యూట్యూబర్ అస్మిత పటేల్, మరో నలుగురిపై సెబీ చర్యలు తీసుకుంది. మార్కెట్‌లో పాల్గొనకుండా వీరిపై నిషేధం పెట్టింది. వీరు కోర్సు ఫీజుల కింద ఇన్వెస్టర్లు, స్టూడెంట్ల నుంచి సేకరించిన రూ.53 కోట్లను సంబంధిత ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చేయాలని సెబీ ఆదేశించింది.
అస్మిత పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అస్మిత జితేష్ పటేల్, జితేష్ జెతలాల్ పటేల్, కింగ్ ట్రేడర్స్, జెమిని ఎంటర్‌ప్రైజ్, యూనైటెడ్ ఎంటర్‌ప్రైజ్‌కు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరో రూ.104.63 కోట్లను ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలని ఆదేశించింది. యూట్యూబర్, ఫిన్‌ఫ్లూయెన్సర్ అస్మిత పటేల్ తనకు తాను ‘షీ వోల్ఫ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్’, ‘ఆప్షన్స్ క్వీన్’ గా ప్రచారం చేసుకుంటోంది. సుమారు లక్ష మంది స్టూడెంట్లు, ఇన్వెస్టర్లు, పార్టిసిపెంట్లకు ఆమె ట్రేడ్ సలహాలు ఇచ్చారని అంచనా.