న్యూఢిల్లీ: పరారిలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా సెక్యూరిటీస్ మార్కెట్‌లో మూడేళ్ల పాటు పాల్గొనకుండా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ (సెబీ) బ్యాన్ విధించింది. అంతేకాకుండా మూడేళ్ల పాటు లిస్టెడ్ కంపెనీలతో అసోసియేట్ కాకుండా బ్యాన్ పెట్టింది. విజయ మాల్యాకు చెందిన సెక్యూరిటీస్ హోల్డింగ్స్, మ్యూచువల్ ఫండ్ యూనిట్స్‌ను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది.
ఎఫ్‌ఐఐ సంస్థ మ్యాటర్‌హార్న్ వెంచర్స్ ద్వారా ఇండియాలోని తన గ్రూప్ కంపెనీల షేర్లను ఇండైరెక్ట్‌గా మాల్యా ట్రేడ్ చేస్తున్నారు. ‘విజయ మాల్యా ఎఫ్‌ఐఐ మ్యాటర్‌హార్న్ వెంచర్స్ కింద తన ఐడెంటిటీని దాచి మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియన్ కంపెనీల్లోని షేర్‌హోల్డర్లకు నష్టం చేకూరుస్తున్నారు’ అని సెబీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. యూనిటైల్ స్పిరిట్స్ (యూఎస్‌ఎల్) షేర్లను డీల్ చేయడానికి ఎఫ్‌ఐఐ సంస్థను వాడుతున్నారని సెబీ పేర్కొంది. మ్యాటర్‌హార్న్ వెంచర్స్‌కు యూఎస్‌ఎల్ లో 9.98 శాతం వాటా ఉంది.