
- స్పష్టం చేసిన సెబీ చైర్‌పర్సన్ మాధవీ పురి
- ఈసాప్స్‌తోనే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఆదాయం
- సెబీ బోర్డు మెంబర్లు ఈసాప్స్ హోల్డ్ చేయొచ్చని వెల్లడి
న్యూఢిల్లీ: ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బచ్, ఆమె భర్త దవళ్ బచ్ శుక్రవారం స్పందించారు. ఇవి తప్పుడు ఆరోపణలని, కావాలనే తమ పరువుతీయడానికి చేస్తున్నారని మండిపడ్డారు.
వాస్తవాలను వక్రీకరించడం క్లియర్‌గా కనిపిస్తోందని జాయింట్ స్టేట్‌మెంట్‌లో వీరు పేర్కొన్నారు. ‘ఇల్లీగల్‌గా మా ట్యాక్స్ ఇన్‌ఫర్మేషన్‌ను పొందారు. ప్రైవసీకి భంగం కలిగించారు.
ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా కొనసాగేందుకు విడతలుగా వివరాలను బయటపెడుతున్నారు’ అని పేర్కొన్నారు. నిజాలను బయటకు తెచ్చే ఉద్దేశమే ఉంటే ఒకేసారి ఆరోపణలన్నింటిని బయటపెడతారని, అలా అయితే ఒకేసారి నిజాలు బయటకొస్తాయని డిమాండ్ చేశారు.
మాధవి రిటైర్‌మెంట్ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఆదాయం పొందడం, వొకార్డ్ అసోసియేషన్ నుంచి రెంటల్ ఇన్‌కమ్ పొందడంపై కాంగ్రెస్ ఈ మధ్య వరసపెట్టి ఆరోపణలు చేస్తోంది.
వీటిపై బచ్ దంపతులు స్పందించారు. దవళ్ ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారని, ఆయనకు 35 ఏళ్ల అనుభవం ఉందని, హిందుస్తాన్ యూనిలీవర్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారని జాయింట్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. లీడింగ్ ప్రొఫెషనల్‌గా ఆయనకు మంచి పేరుందని అన్నారు.
తమ ప్రొఫెషనల్ కెరీర్‌లో ఎటువంటి మచ్చ లేదని పేర్కొన్నారు. మాధవి విడుదల చేసిన స్టేట్‌మెంట్ ప్రకారం, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రిటైరైన వారు పదేళ్ల వరకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ (ఈసాప్స్) ను వాడొచ్చు.
అదే రిజైన్ చేసిన వారు మూడు నెలల్లో వాడుకోవాలి. పెన్షన్ అమౌంట్‌కు సంబంధించి గత పదేళ్లలో వివిధ స్టేజ్‌లలో వాడిన ఈసాప్స్, యాన్యుటీ స్కీమ్‌ల నుంచి పొందామని తెలిపారు.
సెబీ గైడ్‌లైన్స్ ప్రకారం చైర్‌పర్సన్‌తో సహా బోర్డ్ మెంబర్లు ఈసాప్‌లను హోల్డ్ చేయొచ్చు. వొకార్డ్ అసోసియేషన్ నుంచి రూల్స్‌ను బట్టే రెంటల్ ఇన్‌కమ్ పొందారు. మాధవి సెబీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకోకముందే అంటే 2019 లో మహీంద్రా అండ్ మహీంద్రాలో దవళ్ జాయిన్ అయ్యారు. అగోరా అడ్వైజర్స్ సెంబ్ కార్ప్, విజు లీజింగ్‌కు అందించిన సర్వీస్‌లు మాధవి సెబీ మెంబర్ కాకముందే క్లోజయ్యాయి.
సెబీ చీఫ్‌పై లోక్‌పాల్‌లో మొయిత్రా ఫిర్యాదు
మాధవిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్‌పాల్ లో ఫిర్యాదు చేశారు. సెబీలో పనిచేస్తున్నప్పుడు ఐసీఐసీఐ, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ నుంచి మాధవి ఆదాయం పొందారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘‘సెబీ చీఫ్ పై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేశాను. లోక్‌పాల్ ఆ ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిశీలించి సీబీఐ లేదా ఈడీలకు ప్రాథమిక దర్యాప్తు కోసం రిఫర్ చేయాలి. ఇందులో ప్రమేయమున్న ప్రతి ఒక్కరిని విచారించాలి” అని ఎక్స్‌లో తెలిపారు.
అదానీ గ్రూప్‌కి చెందిన వ్యక్తి స్విస్ అకౌంట్లు ఫ్రీజ్?
తైవాన్ రెసిడెంట్ చాంగ్ చంగ్ లింగ్ స్విస్ ఖాతాల్లోని రూ.2,610 కోట్ల (311 మిలియన్ డాలర్ల) ను స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. ఆయన అదానీ గ్రూప్‌కు చెందిన వాడనే వార్తలు వెలువడ్డాయి.
మల్టీపుల్ స్విస్ అకౌంట్లలో ఈ ఫండ్స్‌ను చంగ్ లింగ్ మేనేజ్ చేస్తున్నారు. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని స్విస్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. స్విస్ కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌కు తమకు సంబంధం లేదని పేర్కొంది.