- ఇష్యూలకు రెడ్‌సిగ్నల్.. రూల్స్ ప్రకారం లేకపోవడం వల్లే
న్యూఢిల్లీ: ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ లిమిటెడ్‌తో సహా నాలుగు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (ఐపిఓ)కు సెబీ అనుమతి ఇచ్చింది. ఎకోస్ ఇండియా మొబిలిటీ అండ్ హాస్పిటాలిటీ లిమిటెడ్, కేఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ కూడా రెగ్యులేటర్ క్లియరెన్స్ పొందాయి. ఈ ఏడాది మార్చి– ఏప్రిల్ మధ్య ఇవి తమ ఐపీఓ డాక్యుమెంట్లను సెబీకి అందజేశాయి. ఈ నాలుగు కంపెనీలు జూలై 22-–26 మధ్య సెబీ అబ్జర్వేషన్ లెటర్లను పొందాయి.
ఈ లెటర్వచ్చిందంటే ఐపీఓకు గ్రీన్‌సిగ్నల్ ఉన్నట్టుగానే భావించాలి. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం, సోలార్ సెల్ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ ఐపీఓతో రూ. 1,500 కోట్లను సమీకరిస్తుంది. ఇందులో తాజా ఇష్యూతోపాటు ప్రమోటర్ ద్వారా 2.82 కోట్ల షేర్ల వరకు ఓఎఫ్ఎస్ ఉంటుంది. తాజా ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుబంధ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టడానికి, ఇతర అవసరాలకు వాడతారు. జ్యువెలరీ రిటైల్ చైన్ పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ లిమిటెడ్ ఐపీఓతో రూ. 1,100-కోట్లను సేకరించనుంది.
ఫ్రెష్ ఇష్యూతో రూ.850 కోట్లు సంపాదించనుంది. ప్రమోటర్ ఎస్వీజీ బిజినెస్ ట్రస్ట్ నుంచి రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఓఎఫ్ఎస్ద్వారా అమ్మకానికి వస్తాయి. ఐపీఓ ద్వారా వచ్చిన రూ.850 కోట్లలో మొత్తం రూ.387 కోట్ల నిధులను మహారాష్ట్రలో 12 కొత్త స్టోర్ల ఏర్పాటుకు, రూ.300 కోట్లను అప్పుల చెల్లింపులకు, కొంత భాగాన్ని సాధారణ అవసరాలకు కూడా వినియోగిస్తారు.
డ్రైవర్- ఆధారిత మొబిలిటీ ప్రొవైడర్ ఎకోస్ (ఇండియా) మొబిలిటీ అండ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా 1.8 కోట్ల ఈక్విటీ షేర్ల ఓఎఫ్ఎస్ ఇష్యూ. తాజా ఇష్యూ ఉండదు. కేఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ ఐపీఓలో ఓఎఫ్ఎస్ కాంపోనెంట్ ఉందు. ఫ్రెష్ఇష్యూతో 1.6 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ అవుతాయి. రాజస్థాన్‌లోని అల్వార్‌లోని నీమ్రానాలో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ కేఆర్ఎన్ హెచ్వీఏసీలో పెట్టుబడి కోసం నిధులను వాడతారు. ఈ నాలుగు కంపెనీలూ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అవుతాయి.
ఈ కంపెనీల ఇష్యూలకు నో
సూపర్‌మార్ట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్, ఎన్‌బీఎఫ్‌సీ అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్‌తో సహా నాలుగు సంస్థల ఐపీఓ డ్రాఫ్ట్ పత్రాలను సెబీ వెనక్కి పంపింది. ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ టీపీజీ క్యాపిటల్ -మద్దతు గల సాయి లైఫ్ సైన్సెస్, బీఎండబ్ల్యూ వెంచర్స్ ఆఫర్ డాక్యుమెంట్లను కూడా తిరిగి ఇచ్చింది. ఈ కంపెనీల ఐపీఓ డాక్యుమెంట్లు జులై 1న సెబీకి అందాయి.
జులై 24, 2024 నాటికి సెబీ ఐసీడీఆర్ రెగ్యులేషన్స్, 2018 రెగ్యులేషన్ 7(1) (ఎ)కి అనుగుణంగా లేనందున డాక్యుమెంట్లను తిరిగి పంపించామని సెబీ తెలిపింది. ఈ రూల్స్ ప్రకారం, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు దరఖాస్తు చేసేవారు సెక్యూరిటీల లిస్టింగ్ కోసం సూత్రప్రాయంగా ఆమోదం పొందేందుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టాక్ ఎక్స్ఛేంజీలకు దరఖాస్తు చేయాలి. రెండింట్లో ఒక దానిని ఎంచుకోవాలి.