న్యూఢిల్లీ: మూడేళ్లుగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిపిన తొమ్మిది మందిని సెబీ గుర్తించింది. వీరు రూ.21.16 కోట్లను ఇల్లీగల్‌గా సంపాదించారని తెలిపింది. ఈ ఫ్రంట్ రన్నింగ్ (కంపెనీలకు సంబంధించిన వివరాలు పబ్లిక్ ముందుకు రాకుండానే ముందుగా తెలుసుకొని ట్రేడ్ చేయడం) కేసులో పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఈక్విటీ డీలర్ సచిన్ బకుల్ డగ్లీతో పాటు మరో ఎనిమిది మందిపై కేసు బుక్ చేశారు. సెబీకి పూర్తిగా సహకరిస్తామని పీఎన్‌బీ మెట్‌లైఫ్ ప్రకటించింది. సచిన్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 2021 జనవరి 1 నుంచి ఈ ఏడాది జులై 19 వరకు సెబీ దర్యాప్తు జరిగింది.
ఈ దర్యాప్తు ప్రకారం, సచిన్ బకుల్ డగ్లీ, ఆయన బ్రదర్ తేజస్ డగ్లీ ( ఇన్వెస్టెక్ ఈక్విటీ సేల్స్ ట్రేడర్) పీఎన్‌బీ మెట్‌లైఫ్, ఇన్వెస్టెక్ ఇన్‌స్టిట్యూషనల్ క్లయింట్లు తీసుకునే ఆర్డర్ల వివరాలను పబ్లిక్ ముందుకు రాకముందే తెలుసుకోగలిగారు. దీని ఆధారంగా ట్రేడింగ్ చేశారు.
ఈ వివరాలను ధన్మంట రియల్టీ ప్రైవేట్ (డీఆర్‌పీఎల్), వర్తీ డిస్ట్రిబ్యూటర్స్ (డబ్ల్యూడీపీఎల్) అకౌంట్లతో ట్రేడింగ్ చేస్తున్న సందీప్ శంబర్కర్, ప్రగ్నేశ్ సంఘ్వీతో పంచుకున్నారు. డీఆర్‌పీఎల్, డబ్ల్యూడీపీఎల్ డైరెక్టర్లు అర్పన్ కీర్తికుమార్ షా, కవిత షా, జిగ్నేష్ నికుల్‌భాయ్ డాభికి ఈ కేసుతో సంబంధం ఉంది. మొత్తం 6,766 సార్లు ట్రేడ్ చేశారు.