
న్యూఢిల్లీ: - మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ ఏడాది మార్చి నెలలో స్కోర్స్ ఫ్లాట్‌ఫారమ్ ద్వారా 4,371 ఫిర్యాదులను పరిష్కరించింది. మధువీర్ కామ్18 నెట్‌వర్క్ లిమిటెడ్, నిఖిల్ దయానంద్ బల్జేకర్ అనే సంస్థలకు సంబంధించిన మూడు ఫిర్యాదులు మాత్రమే మార్చి చివరి నాటికి స్కోర్స్ లో మూడు నెలల కంటే ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.
సెబీ డేటా ప్రకారం, ఫిబ్రవరి 28 నాటికి 4,376 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్చిలో 4,156 కొత్త ఫిర్యాదులను తీసుకుంది. మార్చి 31 నాటికి మొత్తం 4,161 ఫిర్యాదులు పరిష్కారం కాలేదు. యాక్షన్టేకెన్రిపోర్ట్స్ (ఏటీఆలు) సమర్పించడానికి సగటున తొమ్మిది రోజులు పట్టిందని సెబీ తెలిపింది. అప్‌గ్రేడ్ అయిన స్కోర్స్ 2.0 ఫ్రేమ్‌వర్క్ కింద ఫిర్యాదులు సంబంధిత సంస్థకు ఆటోమేటిక్‌గా వెళ్తాయి. ఈ దశలో ఏటీఆర్ని సమర్పించడానికి 21 రోజులు సమయం ఇస్తారు. సంతృప్తి చెందని వాళ్లు 15 రోజుల్లో మొదటి స్థాయి సమీక్షను ఎంచుకోవచ్చు.
ఈ కాలంలో ఏటీఆర్ సమర్పించినప్పటికీ, ఫిర్యాదులు పెండింగ్ జాబితాలో ఉంటాయి. అప్పటికీ సంతృప్తి చెందకపోతే సెబీ ద్వారా రెండో స్థాయి సమీక్ష కోరవచ్చు. అంతేకాకుండా, ఆన్‌లైన్ వివాదాల పరిష్కార (ఓడీఆర్) విధానాన్ని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. 2011 జూన్‌లో ప్రారంభమైన స్కోర్స్ కంపెనీలు, మధ్యవర్తులు, మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలపై సెక్యూరిటీల మార్కెట్‌కు సంబంధించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి, పెట్టుబడిదారులకు సహాయపడటానికి ఉపయోగపడుతుంది. గత ఏడాది ఏప్రిల్‌లో సెబీ అదనపు ఫీచర్లతో ప్లాట్‌ఫారమ్ కొత్త వెర్షన్ స్కోర్స్ 2.0ని ప్రారంభించింది.