
SEBI on Stock Scams: దేశీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. వారి పెట్టుబడుల భద్రత కోసం నిరంతరం మార్పులను తీసుకొస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే శుక్రవారం సెబీ మార్కెట్లో పెట్టుబడిదారులకు కీలక హెచ్చరికను జారీ చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ అయిన యూట్యూబ్, ఇన్ స్ట్రాగ్రామ్, ఎక్స్, వాట్సాప్, టెలిగ్రాం వంటి యాప్స్ ద్వారా జరుగుతున్న స్టా్క్ మార్కెట్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. మోసగాళ్లు ఎక్కువగా ఇలాంటి మార్గాల ద్వారా పెట్టుబడిదారులకు అధిక రాబడులను ఎరజూపుతూ ఎడ్యుకేషన్ పేరుతో స్టాక్ టిప్స్, పెట్టుబడి టిప్స్ అందించటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని సెబీ పేర్కొంది. అలాగే భారీగా లాభాలు వస్తాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ, నష్టాలు లేకుండా లాభాలు వస్తాయంటూ సామాన్య పెట్టుబడిదారులను టార్గెట్ చేస్తున్నారని వెల్లడించింది.
వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్లో సెబీ వద్ద రిజిస్టర్ అయిన ఫిన్‌ప్లుయన్సర్లు కేవలం 2 శాతం మాత్రమే కాగా.. దాదాపు 33 శాతం మంది ఫిన్‌ప్లుయన్సర్లు ఎలాంటి చట్టపరమైన పద్దతులనూ పాటించకుండా పెట్టుబడి చిట్కాలను అందిస్తున్నారని వెల్లడైంది. అందువల్ల పెట్టుబడి అవసరాల కోసం సలహాలకై సంప్రదించేటప్పుడు వారి సెబీ రిజిస్ట్రేషన్ వివరాలను ఇన్వెస్టర్లు తప్పకుండా అడిగి తెలుసుకోవాలని సెబీ చెబుతోంది. అయితే చాలా మంది సెబీ వద్ద అనుమతి పొందిన సలహాదారుల మాదిరిగా నటిస్తున్నారని, వీరితో అప్రమత్తంగా వ్వహరించాలని సెబీ ఇన్వెస్టర్లకు సూచించింది.
తప్పుడు కంటెంట్ ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు 'VIP Trading Group', 'Discounted Trading Group', 'Institutional Trading Group', 'Official stock Community 'Investment Club' వంటి ఫ్యాన్సీ పేర్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని సెబీ పేర్కొంది. అలాగే ఇటీవలి కాలంలో మోసగాళ్లు ఏకంగా నిజమైన ట్రేడింగ్ యాప్స్ మాదిరిగా కనిపించే నికిలీలను సృష్టిస్తుండగా.. మరికొందరు తమ యాప్స్ వాడిటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయంటూ ఆజచూపి చివరికి ఇన్వెస్టర్ల డబ్బును డ్రా చేసుకోవటానికి వీలు లేకుండా ఫ్రీజ్ చేస్తున్నారని సెబీ హెచ్చరించింది. అందుకే ఇన్వెస్టర్లు మార్కెట్లో అధికారిక యాప్స్, సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ల నుంచి మాత్రమే సేవలను పొందాలని పేర్కొంది.
సెబీ వద్ద గుర్తింపు కలిగిన అసలైన అడ్వైజరీలు, ట్రేడింగ్ యాప్స్ వివరాలను ఈ లింక్స్ ద్వారా తెలుసుకోవచ్చు..
* Registered intermediaries: https://www.sebi.gov.in/intermediaries.html
* Trading Apps: https://investor.sebi.gov.in/Investor-support.html