కలెక్టరేట్ ఎదుట ధర్నాలు, నిరసనలు

  •     నేషనల్ హైవేపై ధర్నా చేసిన సెకండ్ ఏఎన్ఎంలు 
  •     ఇండ్లివ్వాలంటూ గోదావరి వరద బాధితుల ఆందోళన 
  •     ఏడాది కాలంగా డీడీలు కట్టిన గొర్రెలివ్వడం లేదని యాదవుల నిరసన 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ నేషనల్​హైవేపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సెకండ్​ ఏఎన్ఎంలు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.  అనంతరం కలెక్టరేట్​ ఎదుట చేపట్టిన ధర్నాలో నేతలు మాట్లాడారు. 16 ఏండ్లుగా మారుమూల గ్రామాల్లో వైద్య సేవలందిస్తున్న తమను ప్రభుత్వం రెగ్యులర్​ చేయాలని డిమాండ్​ చేశారు.  

ఏఎన్​ఎంల నోటిఫికేషన్‌ను రద్దు చేసి సర్వీస్‌లో ఉన్న తమను పర్మినెంట్​ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.  కొవిడ్​ టైంలో వెట్టి చాకిరీ చేశామన్నారు.  ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని కోరారు. 

సీఐటీయూ ఆధ్వర్యంలో 

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ కాంట్రాక్ట్​ పద్దతిపై పనిచేస్తున్న ఏఎన్​ఎంలు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్​ అయిందని నేతలు పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో రాజేశ్వరీ, కమల, శశికళ, జ్యోతి, పద్మ, సుజాత, వీరన్న, సత్య పాల్గొన్నారు.

 ముల్కలపల్లి మండలంలోని గొర్రెల, మేకల పెంపకం దారుల సొసైటీ ఆధ్వర్యంలో యాదవులు కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. డీడీలు కట్టిన ఏడాది కాలంగా తమకు గొర్రెలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రాన్ని ఇచ్చారు.  

వరద బాధితుల ధర్నా 

చర్ల మండలంలోని కొత్తపల్లి, కేశవాపురం, గుంపెనగూడెం, ఆనందకాలనీ, జీపీ పల్లి గ్రామాల పరిధిలోని గోదావరి వరద ముంపు బాధితులు సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్​వద్ద ధర్నా చేపట్టారు.  కలెక్టరేట్​లోపలకి వెళ్లకుండా పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో లోపలికి వెళ్లేందుకు కొందరు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.  

గోదావరి వరద ముంపు బాధితులకు ఇండ్లు కట్టివ్వాలని, ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు గృహలక్ష్మి కింద  సహాయం అందించాలని సీపీఎం జిల్లా నాయకులు మెచ్చ వెంకటేశ్వర్లు అన్నారు.  ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వరద బాధితులకు 5 సెంట్ల భూమితో పాటు గృహలక్ష్మి వర్తింప చేయాలన్నారు.