
- ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్‌కుమార్‌గా గుర్తింపు
- మరో ఆరుగురి ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ
- పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహం తరలింపు
నాగర్‌కర్నూల్/ఉప్పునుంతల, వెలుగు:ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మంగళవారం ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్‌కుమార్(50) డెడ్ బాడీని వెలికితీశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో టన్నెల్ చివర 60 మీటర్ల దూరంలో కన్వేయర్ బెల్ట్ డ్రమ్ దగ్గర మట్టిలో కూరుకుపోయిన లోకో ఇంజన్ సమీపంలో మనోజ్ కుమార్ డెడ్ బాడీ గుర్తించారు. దుర్వాసన రావడంతో రెస్క్యూ బృందాలు ఐరన్ పార్ట్స్ తొలగించి డెడ్‌బాడీ ఉన్నట్లు నిర్దారించుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
మంగళవారం ఉదయం షిప్టులో డాక్టర్లు, పారా మెడికల్ బృందాలతో టన్నెల్ లోపలికి వెళ్లిన టీం లోకో ట్రైన్లో డెడ్‌బాడీని బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మనోజ్‌కుమార్ జేపీ అసోసియేట్స్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లా బంగార్మౌ గ్రామానికి చెందిన మనోజ్‌కు భార్య స్వర్ణలత, కొడుకు ఆదర్శ్, కూతురు శైలజ, తల్లి జమునా దేవి ఉన్నారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో మట్టిలో కూరుకుపోయిన డెడ్‌బాడీ వేలికి ఉన్న ఉంగరం, మెడలోని చైన్, ప్యాకెట్లో ఉన్న మొబైల్ ద్వారా మనోజ్ కుమార్‌గా గుర్తించారు.
17 రోజుల తరువాత రెండో డెడ్‌బాడీ..
టీబీఎం ఎరక్టర్ గురుప్రీత్‌సింగ్ డెడ్‌బాడీ దొరికిన 17 రోజుల తరువాత మనోజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. గత నెల 22న జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో పలు అవాంతరాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని అధిగమించి ఈ నెల 9న డి2 పాయింట్ వద్ద గురుప్రీత్‌సింగ్ డెడ్‌బాడీని గుర్తించారు. ఎన్జీఆర్ఐ, క్యాడవర్ డాగ్స్ స్క్వాడ్ గుర్తించిన డి1, డి2 ప్రదేశాల్లో మిగిలిన వారి ఆచూకీ కోసం టీబీఎం మెషీన్‌ను కట్ చేయడంతో పాటు మట్టి, రాళ్లు, బురదను బయటికి తోడేశారు.
టన్నెల్ చివరి నుంచి దాదాపు 300 మీటర్ల వరకు వెనక్కి కొట్టుకొచ్చిన 1,500 టన్నుల బరువు ఉన్న టీబీఎం భాగాలు విరిగిపోయి టన్నెల్లో అడ్డంగా పడిపోయాయి. 9.55 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న టన్నెల్లో 9 మీటర్ల వరకు మట్టి, రాళ్లతో నిండిపోయింది. 32 రోజుల పాటు కొనసాగిన రెస్య్కూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, రైల్వే, ఫైర్, జేపీ అసోసియేట్స్ కంపెనీ సిబ్బందికి ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, బీఆర్వో, ఐఐటీ చైన్నై వంటి సంస్థల ఉన్నతాధికారులు సహకరించారు.
193 మీటర్ల మట్టిని తీయాల్సిందే..
14 కిలోమీటర్ల పొడవు ఉన్న టన్నెల్ చివరలో ప్రమాదం జరిగిన సమయంలో పని చేస్తున్న 50 మందిలో 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. టీబీఎం పక్కన, పరిసరాల్లో పని చేస్తున్న 8 మంది అందులో చిక్కుకుకున్నారు. కూలిన మట్టి, నీటి ఊట ధాటికి టన్నెల్ చివరి నుంచి 300 మీటర్ల వెనక్కి కొట్టుకొచ్చిన టీబీఎం పాక్షికంగా ధ్వంసమైంది. కన్వేయర్ బెల్ట్ డ్రమ్, ఎయిర్ పంప్ వెంటిలెట్స్, ఆక్సిజన్ ప్లాంట్ పనికి రాకుండా పోయాయి. 8 మంది చిక్కుకున్న ప్రాంతాలను డి1, డి2, ఎ5గా గుర్తించిన అధికారులు అక్కడి నుంచి మట్టి తవ్వకాలు, రాళ్ల తరలింపు చేపట్టారు.
టీబీఎం బ్యాక్ పార్ట్‌ను గ్యాస్, ప్లాస్మా కటర్లతో కట్ చేశారు. టన్నెల్ చివరి నుంచి 43 మీటర్ల దూరంలో డి1 పాయింట్, ఇక్కడి నుంచి 20 మీటర్ల దూరంలో డి2 పాయింట్‌గా గుర్తించారు. డి2 నుంచి 253 మీటర్ల దూరంలో కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. దీని సమీపంలోనే లోకో ఇంజన్ మట్టిలో కూరుకుపోయింది. నీటి ఊటతో అత్యంత ప్రమాదకరంగా మారిన డి1, డి2 ప్రాంతాల నుంచి ఇవతలి వైపు మట్టి, రాళ్లు జారకుండా స్టీల్ మెస్ బిగించామని సింగరేణి జీఎం బైద్య వివరించారు. 253 మీటర్ల పొడవునా పేరుకుపోయిన మట్టి, రాళ్లలో.. 60 మీటర్ల వరకు తొలిగించామని, మిగిలిన 193 మీటర్ల మట్టి,రాళ్లను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు.
కార్మికులతో పాటు నాలుగు ఎస్కవేటర్లు పని చేయడంతో మట్టి, రాళ్ల తొలగింపులో స్పీడ్ పెరిగిందని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఏప్రిల్ 10 వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తామని తెలిపారు. డిజాస్టర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తుండగా, తెలంగాణ, ఏపీ సబ్ ఏరియా జనరల్ కమాండింగ్ ఆఫీసర్ అజయ్ మిశ్రా, ఎన్డీఆర్ఎఫ్కు చెందిన పరీక్షిత్ మెహ్రా తదితరులు రెగ్యులర్ మానిటర్ చేస్తున్నారు.
స్వగ్రామానికి డెడ్‌బాడీ..
ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహనికి నాగర్‌కర్నూల్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఆయన స్వగ్రామానికి తరలించారు. కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ, ఇరిగేషన్, హెల్త్ డిపార్ట్ మెంట్లకు చెందిన ముగ్గురు ఆఫీసర్లు, పోలీస్ ఎస్కార్ట్ తో ప్రత్యేక వాహనంలో డెడ్‌బాడీ పంపించారు. మనోజ్ కుమార్ ఫ్యామిలీకి రాష్ట్ర సర్కారు ప్రకటించిన రూ.25 లక్షల పరిహారం చెక్కును ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అధికారులకు అందజేశారు.