- సిట్టింగులకు టికెట్ఇస్తే పనిచేయమంటున్న సెకండ్ క్యాడర్
- వద్దన్నా టికెట్ఇస్తే పార్టీని వీడేందుకు రెడీ
- ఆల్టర్‌నేట్ ఆలోచనల్లో ఆశావహులు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని సిట్టింగులకు టిక్కెట్ ఇవ్వొద్దని సెకండ్ క్యాడర్ లీడర్లు హైకమాండ్‌ను కోరుతున్నారు. వద్దంటే వద్దని తీర్మానాలు చేస్తుండడంతో సిట్టింగ్‌ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఆశావహులు తలలుపట్టుకుంటున్నారు. జిల్లా బీఆర్ఎస్‌లో ఇంత రచ్చ జరుగుతున్నా హైకమాండ్ పట్టించుకోకపోవడంతో పలువురు పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోందికాగా ఎలక్షన్టైంలో అసమ్మతివాదులు తమ గెలుపు అవకాశాలపై దెబ్బకొడతారన్న ఆందోళనలో ఆశావహులు ఉన్నారు.
దాసరిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌లోకి..
పెద్దపల్లి జిల్లాలో మూడు నియోజకవర్గాల్లోనూ అసమ్మతి నెలకొని ఉంది. ఇటీవల పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడంతోపాటు ఆయనకు టికెట్ఇస్తే తాను ప్రగతిభవన్ ముందు దీక్ష చేస్తానని చెప్పిన మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్.రాజయ్య కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ హైకమాండ్ స్పందించకపోవడంతోనే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన చెప్తున్నారు. ఈయనతోపాటు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కూడా అనుచరులతో కలిసి
కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు దాసరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసమ్మతి పెరిగిపోతున్నా దాసరి మనోహర్‌రెడ్డి సైలెంట్‌గా ఉంటున్నారు.
సీఎంను కలిసిన రామగుండం అసమ్మతివాదులు
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు టికెట్ఇవ్వొద్దని ఆ నియోజకవర్గానికి చెందిన ప్రధాన నాయకులు ఇప్పటికే సీఎంను కోరారు.
చందర్‌కు కాకుండా ఎవరికి టికెట్ఇచ్చినా గెలిపించుకుంటామని మంత్రి కేటీఆర్‌కు సైతం స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో చందర్‌కు వ్యతిరేకంగా ఆయన వ్యతిరేకవర్గం ప్రజల్లో తిరుగుతూ ప్రజాసమస్యలు తెలుసుకుంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
మంథనిలోనూ అంతే..
మంథనిలోనూ పుట్ట మధుపై క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఏడాదిగా ఆయనపై ఏదో ఓచోట అసంతృప్తి గళం విన్పిస్తోంది. ముత్తారం మండల కేంద్రంలో ఇటీవల బీఆర్‌ఎస్ ముఖ్య లీడర్లు మీటింగ్ ఏర్పాటు చేశారు. మధుకు టికెట్ఇస్తే పనిచేయొద్దని, ఆయన అవినీతి, నేరచరిత్రను ప్రజలకు తెలియపరిచేందుకు పాదయాత్ర చేయాలని ఆ మీటింగ్‌లో నిర్ణయించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా వ్యతిరేకత పెరుగుతుండడంతో హైకమాండ్‌తోపాటు సాధారణ కార్యకర్తలు కూడా డైలమాలో పడిపోయారు.
అయితే కారు గుర్తు.. లేకుంటే మరో గుర్తు
పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎప్పుడూ లేని విధంగా అధికార పార్టీలో అసమ్మతి రోడ్డెక్కింది. దీన్ని అదుపు చేయడానికి హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో టికెట్ఆశించేవారు నియోజకవర్గాల్లో తిరుగుతూ తమకే టికెట్వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. కాగా హైకమాండ్ఎవరికి టికెట్ఇస్తుందోనని సిట్టింగులతో పాటు, ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వీరంతా ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే కారు గుర్తు, లేదంటే మరో గుర్తుపై పోటీచేసుడేనని అనుచరుల వద్ద చెప్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్ గతంలోలాగా పైచేయి సాధించే అవకాశంలేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆపార్టీని దెబ్బతీస్తాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.