కులగణన రీసర్వే పూర్తి..కొత్తగా 18వేల539 ఫ్యామిలీలు

కులగణన రీసర్వే పూర్తి..కొత్తగా 18వేల539 ఫ్యామిలీలు
  • ఫస్ట్ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాలు 3.56 లక్షలు 
  • రీసర్వే చేసినా.. వీరిలో 5.21% కుటుంబాలే నమోదు    
  • రెండు సర్వేలు కలిపితే.. మొత్తం 97.08 శాతం పూర్తి 
  • రీసర్వేకూ కేసీఆర్,  కేటీఆర్, హరీశ్ దూరం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే కూడా పూర్తయింది. ఇందులో సైతం ఆశించిన సంఖ్యలో కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకోలేదు. మొదటిసారి నిర్వహించిన కుల గణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదుచేసుకోకుండా మిగిలిపోయాయి. 

వీరికోసం రెండోసారి సర్వే నిర్వహించినా.. 18,539 కుటుంబాలు (5.21%) మాత్రమే ఎంట్రీ చేయించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించగా.. గత నవంబరు 6 నుంచి డిసెంబరు 25 వరకు జరిగిన మొదటి సర్వేలో 1,12,15,134 కుటుంబాల(96.9) వివరాలు నమోదయ్యాయి. ఇంకా 3,56,323 (3.1 శాతం) కుటుంబాలు మిగిలిపోవడంతో వారి వివరాల నమోదు కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండోసారి సర్వే నిర్వహించారు. 

ఈ రీసర్వేలో18,539 కుటుంబాలే వివరాలు ఎంట్రీ చేయించుకున్నాయి. దీంతో రెండు సర్వేలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా 3,37,964 ఫ్యామిలీలు మిగిలిపోయాయి. మొత్తంగా రెండు సర్వేల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 1,12,33,673(97.08 శాతం) కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. సర్వే సులభంగా పూర్తయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వివిధ రకాలుగా అవకాశం కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే అధికారులే ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. 

గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో ఆఫీసులకు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసుల్లో ప్రజా పాలనా కేంద్రాలకు వెళ్లి కూడా ప్రజలు వివరాలు నమోదు చేయించుకునే చాన్స్ ఇచ్చారు. అలాగే ఆన్ లైన్ లో ఫారమ్ డౌన్ లోడ్ చేసుకుని, స్వయంగా నింపి, అధికారులకు అందజేసేందుకూ వీలు కల్పించింది. అయినా, అనుకున్నంత స్పందన మాత్రం రాలేదు. 

కొద్దిగా మారనున్న లెక్కలు 

కుల గణన రీసర్వేలో నమోదైన18 వేలకుపైగా కుటుంబాలను అప్ డేట్ చేయడంతో కులాల లెక్కల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ఫస్ట్ సర్వే తర్వాత ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43 శాతం (61,84,319),  ఎస్టీల జనాభా 10.45 శాతం (37,05,929 ), బీసీల జనాభా 46.25 శాతం (1,64,09,179) ఉన్నట్టు పేర్కొన్నారు. 

మొత్తం ముస్లిం జనాభా 12.56 శాతం (44,57,012) కాగా ఇందులో బీసీ ముస్లింల జనాభా 2.48 శాతం( 8,80,424 ),  ఓసీ ముస్లింల జనాభా10.08 శాతం (35,76,588), ఇతర ఓసీల జనాభా 13.31 శాతం (44,21,115)గా ఉన్నాయి. రీసర్వే వివరాలనూ కలిపితే ఈ లెక్కలు స్వల్పంగా మారనున్నాయని అధికారులు చెప్తున్నారు.  

రెండో సర్వేకూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ దూరం 

ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు ఈసారి కూడా కుల గణన సర్వేలో తమ వివరాలను ఎంట్రీ చేయించు కోలేదు. కుల గణన సర్వేపై విమర్శలు చేసిన కేటీఆర్, హరీశ్ రావు.. రీసర్వేకు డిమాండ్ చేశారు. రీసర్వే చేస్తే తాము కూడా వివరాలు ఇస్తామన్నారు. దీంతో రీసర్వే చేపట్టిన ప్రభుత్వం మిగిలిపోయిన వాళ్లంతా వివరాలు నమోదు చేసుకోవాలని కోరింది. 

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఈసారైనా వివరాలు నమోదు చేసుకోవాలని  సీఎం రేవంత్ రెడ్డితోసహా మంత్రులు కోరారు. కానీ, రెండో కుల గణన సర్వేలో కూడా వీరు ముగ్గురూ వివరాలు నమోదు చేయించు కోలేదని తెలిసింది. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాత్రం మొదటి విడత కుల గణన సర్వేలోనే వివరాలను ఎంట్రీ చేయించుకున్నారు.