
ఆసిఫాబాద్/ఆదిలాబాద్టౌన్/భీమారం, వెలుగు: రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన రెండో విడత రుణమాఫీ పథకాన్ని జిల్లాలో ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి రెండో విడత రైతు రుణమాఫీ పథకం నిధులను వర్చువల్ విధానం ద్వారా విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీఏఓ శ్రీనివాస్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2వ విడతలో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు రుణ మాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 14,623 మంది రైతులకు రూ.153.35 కోట్లు రుణమాఫీ కానున్నట్లు చెప్పారు.
ఈ నిధులను ఒకేసారిలో రైతుల ఖాతాలలో జమ చేస్తామని, బ్యాంకు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ సాఫీగా సాగేలా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆదిలాబాద్ కలెక్టర్రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ రుణమాఫీ ద్వారా జిల్లాలో మొదటి విడతలో 18,740 మంది రైతు కుటుంబాలకు రూ. 120 కోట్ల మేర లబ్ధి చేకూరిందని, రెండో విడతలో రూ.201 కోట్ల నిధులను 17,647 మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. ఏమైనా ఇబ్బందులుంటే జిల్లా నోడల్ అధికారి ఎస్.రమేశ్ ను 7288894003లో సంప్రదించాలన్నారు.
రైతుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని కాంగ్రెస్ భీమారం మండల ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కొమ్ము అశోక్ యాదవ్ అన్నారు. రుణమాఫీతో రైతుల ఇండ్లల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. సీఎం, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫొటోలకు రైతులు, మహిళలతో మండల కేంద్రంలోని రైతు వేదిక ముందు క్షీరాభిషేకం చేశారు.