సెకండ్​ లిస్ట్​ టెన్షన్ బీజేపీ, కాంగ్రెస్​లో ఉత్కంఠ

సెకండ్​ లిస్ట్​ టెన్షన్ బీజేపీ, కాంగ్రెస్​లో ఉత్కంఠ
  • ఢిల్లీలో కొనసాగుతున్న తుది కసరత్తు
  • ఎమ్మెల్యే స్థాయి నేతల చేరికపైనే గురి
  • వాళ్ల కోసం కొన్ని సీట్లు పెండింగ్​లో పెట్టి.. 
  • నేడు జాబితా రిలీజ్​ చేయనున్న కాంగ్రెస్​!
  • ఇతర పార్టీల్లో టికెట్ల పంపిణీ 
  • పూర్తయ్యే దాకా ఆగాలని భావిస్తున్న బీజేపీ

హైదరాబాద్, వెలుగు:  అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్​, బీజేపీ ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఈసారి ఎట్లయినా బీఆర్​ఎస్​ను ఢీ కొట్టాలనే టార్గెట్​తో కాంగ్రెస్.. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకే అభ్యర్థుల ఎంపికలో  రెండు పార్టీలు ఆఖరి నిమిషం వరకు కసరత్తు చేసే పనిపెట్టుకున్నాయి. బీఆర్​ఎస్​, బీజేపీలో టికెట్​రాని లీడర్లను, అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానించే పనిలో కాంగ్రెస్ ఇప్పటికే లీనమైంది. రెండు నెలలుగా ఎమ్మెల్యే స్థాయి లీడర్ల జాయినింగ్​లపైనే ఆ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్​ పెట్టింది. ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకొని, వాళ్లు అడిగిన చోట టికెట్లు ఇస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల మొత్తం లిస్టు వచ్చే దాకా వెయిట్​ చేయాలని బీజేపీ భావిస్తున్నది. కాంగ్రెస్​లో టికెట్లు రాని లీడర్లను తమ వైపు తిప్పుకోవాలని 
యోచిస్తున్నది. దీంతో ఈ రెండు పార్టీల అభ్యర్థుల ఎంపిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి, ఆయా పార్టీల నేతల్లో టెన్షన్​ పుట్టిస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్​  అనుసరిస్తున్న వలస లీడర్ల స్ట్రాటజీతో జాబితాల విడుదల రేపు మాపంటూ వాయిదా పడుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ 55 స్థానాలకు, బీజేపీ 52 స్థానాలకు మొదటి జాబితాలను ప్రకటించాయి. సెకండ్ లిస్ట్ రిలీజ్ పై ఢిల్లీలో ఏ పార్టీ హైకమాండ్​ పెద్దల వద్ద ఆ పార్టీ లీడర్లు చర్చలు జరుపుతున్నారు. 

కాంగ్రెస్​లో మూడో లిస్టుకూ చాన్స్​

కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నది. 64 సీట్లను పెండింగ్ లో పెట్టిన ఆ పార్టీ.. వాటిలో ఎవరెవరిని పోటీలోకి దింపాలనే దానిపై చర్చలు జరుపుతున్నది. ఇదే అంశంపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఢిల్లీలో మూడున్నర గంటల పాటు సమావేశమైంది. జాబితాను గురువారం ఉదయం ప్రకటించే అవకాశం ఉంది.  ఇతర పార్టీల నుంచి కీలక నేతలు చేరే అవకాశమున్న స్థానాలను పెండింగ్​లో పెట్టే చాన్స్​ ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల పార్టీలో చేరిన కీలక నేతల్లో ఎక్కువ మందికి కాంగ్రెస్​ టికెట్లు ఇచ్చింది. మైనంపల్లి హన్మంతరావు, ఆయన కొడుకు రోహిత్​రావు​, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చంద్రశేఖర్​,  ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గద్వాల జెడ్పీ చైర్​పర్సన్​ సరిత, మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్​రెడ్డి ఇటీవలే కాంగ్రెస్​లో చేరారు. వీరిలో తొలి జాబితాలో కొందరికి టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్​.. రెండో జాబితాలో మిగిలినవారిని సర్దుబాటు చేసే అవకాశం ఉంది. కొత్తగా వలసొచ్చే ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నేతల కోసం సెకండ్​ లిస్టులోనూ కొన్ని సీట్లు పెండింగ్​లో పెట్టాలని కాంగ్రెస్​ భావిస్తున్నట్లు టాక్​. దీన్ని బట్టి ఆ పార్టీ మూడో లిస్టును కూడా విడుదల చేసే చాన్స్​ కనిపిస్తున్నది. కాగా, టికెట్లు ఆశిస్తున్న పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేశారు. తమకు పరిచయం ఉన్న ఏఐసీసీ లీడర్ల ద్వారా చివరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుల అంశంపై ఇప్పటికే ఏఐసీసీ చర్చించింది. సీపీఐకి 2, సీపీఎంకు 2 చొప్పున స్థానాలను కాంగ్రెస్​ కేటాయిస్తుందనే ప్రచారం జరుగుతున్నది. కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు తమకు ఇచ్చే అవకాశముందని ఇప్పటికే సీపీఐ సూచనప్రాయంగా  వెల్లడించింది. వైరా, మిర్యాలగూడ సీట్లను సీపీఎంకు ఇచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్​ వర్గాలు చెప్తున్నాయి. అయితే.. మిర్యాలగూడ సీటుపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. 

ఆఖరి నిమిషం దాకా వెయిటింగ్​లో బీజేపీ
 
బీజేపీ కూడా అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు చేస్తున్నది. ఇతర పార్టీల్లో టికెట్ల పంపిణీ పూర్తయ్యేదాకా వెయిట్​ చేసి.. ఆ తర్వాత తమ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయాలని కమలం పార్టీ భావిస్తున్నది. ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నేతలను, అసంతృప్తులను చేర్చుకొని ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ ప్లాన్​ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్​ వినిపిస్తున్నది. అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించటమే తమ వ్యూహమని ఇప్పటికే బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీలో అభ్యర్థుల ఎంపిక ఆఖరి నిమిషం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. 

ALS0 READ: అచ్చంపేటలో కారు దిగుతున్న క్యాడర్ .. కాంగ్రెస్​లోకి భారీగా వలసలు

ఇక, జనసేనతో పొత్తుల అంశం ఇంకా తేలలేదు. ఇప్పుడున్న పరిణామాలను చర్చించేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీకి వెళ్లారు.  పొత్తులో భాగంగా తెలంగాణలో 20 స్థానాలను జనసేన కోరుతున్నది. 6 నుంచి 10 సీట్లు కేటాయించేందుకు బీజేపీ సుముఖంగా ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏయే స్థానాలు కేటాయించాలనే అంశం ఢిల్లీలో జాతీయ నేతల సమక్షంలో తేలే అవకాశం ఉంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లితోపాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని పలు స్థానాలు కేటాయించాలని జనసేన ఇప్పటికే కోరినట్లు సమాచారం. దీంతో ఏయే సెగ్మెంట్లను జనసేనకు బీజేపీ ఇస్తుంది.. సెకండ్​ లిస్ట్ లో ఎవరెవరికి టికెట్లు కేటాయిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతున్నది.