మార్చికల్లా సెకండ్ ఫేజ్ మెట్రో డీపీఆర్ సిద్ధం: ఎండీ NVS రెడ్డి

మార్చికల్లా సెకండ్ ఫేజ్ మెట్రో డీపీఆర్ సిద్ధం: ఎండీ NVS రెడ్డి

హైదరాబాద్: హైదరాబాద్‎ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షను నెరవేర్చే దిశగా మెట్రో రైల్ విస్తరణ కార్యక్రమాలను చేపడుతున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పర్యావరణ హితంగా హైదరాబాద్ ఉండాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసి) గ్రీన్ తెలంగాణ సమ్మిట్ 2025లో భాగంగా శనివారం (ఫిబ్రవరి 15) జరిగిన గ్రీన్ క్రూసేడర్స్ కార్యక్రమంలో ఎన్వీఎస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడ్చల్, శామీర్ పేట్, ఫ్యూచర్ సిటీ మార్గాల్లో రాబోయే మెట్రో కారిడార్లకుసంబంధించి డీపీఆర్ మార్చి నెలకల్లా సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామని వెల్లడించారు. కొత్త మెట్రో మార్గాలు హైదరాబాద్ రూపురేఖలనే మార్చి వేస్తాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ నాలుగు వైపులా మెట్రో రైల్ నడపాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకూ అనుగుణంగా తగిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. 

ఈ అభివృద్ధి ద్వారా హైదరాబాద్ అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన హరిత నగరంగా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‎లో పలు ప్రాజెక్టులు హరితమయంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఐజీబీసీలలో గ్రీన్ క్రూసేడర్స్‎గా నమోదు చేసుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు నమోదు పాత్రలను అందజేశారు. ఈ కార్యక్రమంలోఐజీబీసి నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, హైదరాబాద్ చైర్మన్ జి.శ్రీనివాస మూర్తి, క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ వి.రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.