
- టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలే అవకాశం లేదంటున్న పరిశీలకులు
- గత ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటుతోనే గట్టెక్కిన అభ్యర్థులు
- ఈసారి రెండో ఓటుపై విస్తృతంగా ప్రచారం
నల్గొండ, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు కీలకం కానుంది. దీంతో బరిలో ఉన్న 19 మంది అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో వార్ వన్ సైడ్ ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రెండో ప్రాధాన్య ఓట్లే ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉన్నాయి. ఈ క్రమంలో రెండో ప్రాధాన్యత ఓట్లపై అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు.
50 శాతం ఓట్లు పోలైతేనే..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి, రెండు, మూడు అన్న అంకెలను ప్రాధాన్యతాక్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో తొలుత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కన్నా ఒక ఓటు అధికంగా ఎవరికీ రాకుంటే.. రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే గత మూడు సార్లు జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే రెండో ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలింది. దీంతో ఈసారి మొదటి ప్రాధాన్యత ఓటుతో గట్టెక్కే పరిస్థితి లేదని అభ్యర్థులు భావిస్తున్నారు.
రెండో ఓటు ఎటు..?
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ఓటు కంటే రెండో ప్రాధాన్యత ఓట్లపై చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో మొత్తంగా 18,885 ఓట్లు పోలయ్యాయి. వీటిలో చెల్లని ఓట్లు పోగా, 18,027 ఓట్లు లెక్కించారు. ఇందులో యూటీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన నర్సిరెడ్డికి 8,976 ఓట్లు రాగా, పీఆర్‌టీయూ అభ్యర్థి పూల రవీందర్‌కు 6,279 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డికి మరో 38 ఓట్లు తక్కువ పడడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో నర్సిరెడ్డి 9,021 ఓట్లు, పూల రవీందర్‌కు 6,292 ఓట్లు పోలయ్యాయి.
దీంతో 2,729 ఓట్ల ఆధిక్యతతో నర్సిరెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పీఆర్‌టీయూ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన సర్వోత్తమ్‌రెడ్డికి 1,883 ఓట్లు పోలయ్యాయి. పీఆర్‌టీయూ ఓట్లు చీలడంతో యూటీఎఫ్ కు లబ్ధిచేకూరింది. అయితే పీఆర్‌టీయూతోపాటు చీలిక సంఘాల నాయకులు ఈ ఎన్నికల్లో పోటీలో ఉండడంతో ఉత్కంఠంగా మారాయి.
కీలకం కానున్న బీసీ ఓటర్లు..
మొదటి సారి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం తీసుకురావడంతో వారి ఓట్లే కీలకం కానున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 25,704 మంది టీచర్లు ఉండగా, అందులో 20 వేల మంది బీసీలే ఉన్నారు. అయితే ఇప్పటికే సంఘాల్లో చీలిక ఏర్పడగా, పరోక్షంగా బీసీ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓటు ప్రధాన సంఘాల నాయకుల వైపు మొగ్గు చూపినా రెండో ప్రాధాన్యత ఓటు మాత్రం బీసీ అభ్యర్థులకు వేసినట్లు సమాచారం.